జార్ఖండ్‌లో కింగ్... కశ్మీర్‌లో కీలకం!

24 Dec, 2014 01:31 IST|Sakshi
జార్ఖండ్‌లో కింగ్... కశ్మీర్‌లో కీలకం!

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మెజారిటీ; జమ్మూకశ్మీర్లో ‘మిషన్ 44’ విఫలం
 
కశ్మీర్‌లో అతిపెద్ద పార్టీగా పీడీపీ; రెండో స్థానంలో కమలం
ఒక స్థానంలో ఓడి, మరో స్థానంలో గెలిచిన ఒమర్ అబ్దుల్లా
రెండు రాష్ట్రాల్లోనూ ఘోరంగా ఓడిన కాంగ్రెస్
 
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆశలు పెట్టుకున్న మోదీ హవా జార్ఖండ్‌లో స్పష్టంగా కనిపించగా, కశ్మీర్‌లో అనుకున్నంత ప్రభావం చూపలేదు. జార్ఖండ్‌లో 42 స్థానాలతో బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ 37, మిత్రపక్షం ఏజేఎస్‌యూ 5 సీట్లు గెలుపొంది, మెజారిటీకి అవసరమైన 41 కన్నా ఒకటి ఎక్కువగా సాధించాయి.

కశ్మీర్‌లో 28 స్థానాల్లో గెలిచి పీడీపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ‘మిషన్ 44’ ఆశించిన ఫలితమివ్వలేదు. కానీ, గత ఎన్నికలకన్నా మెరుగైన ఫలితాలు సాధించిం ది. 2008 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలిచిన కమలదళం ఈసారి 25 స్థానాలు గెలుచుకుంది. అవన్నీ జమ్మూ ప్రాంతంలోనివే కావడం గమనార్హం.

రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల శాతంలో బీజేపీనే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. కాగా, ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయ పరంపరను కొనసాగించింది. కశ్మీర్‌లో 12 స్థానాలతో 4వ స్థానంలో, జార్ఖండ్‌లో 11 స్థానాలతో 3వ స్థానంలో నిలిచింది. కశ్మీర్‌లో 2008 ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అధికారంలోకి వచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ ఈ ఎన్నికల్లో భారీగా నష్టపోయి 15 సీట్లే గెలుచుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ నవంబర్ 25-డిసెంబర్ 20 మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఆశల పల్లకీ.. జమ్మూకశ్మీర్
స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల సభలో పలుమార్లు చేసిన విజ్ఞప్తిని కశ్మీర్ ప్రజలు పట్టించుకోలేదు. రికార్డు స్థాయి ఓటింగ్ నమోదవడంతో విజయంపై బీజేపీ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. 87 స్థానాల అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా 44 స్థానాల మెజారిటీ ఇవ్వకుండా ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠకు తెరలేపారు. నంబర్ గేమ్‌ను తెరపైకి తెచ్చి అన్ని ప్రధాన పార్టీలకు అధికారంలోకి వచ్చే అవకాశం కల్పించి ఆశలు రేపారు.

జమ్మూలోని మూడు ప్రధాన ప్రాంతాల్లోని ఫలితాల్లో స్పష్టమైన భేదం కనిపించింది. మొత్తం 25 స్థానాలనూ జమ్మూలోనే గెలుచుకున్న బీజేపీ.. కశ్మీర్ లోయ, లడఖ్‌ల్లోని 50 స్థానాల్లో  కనీసం ఖాతా తెరవలేకపోయింది. జమ్మూలోని మొత్తం 37 స్థానాలున్నాయి. మాజీ వేర్పాటువాద నేత సజ్జాద్ లోన్ నేతృత్వంలోని జమ్మూకశ్మీర్ పీపుల్ కాన్ఫెరెన్స్ 2 స్థానాల్లో, జేకేపీడీఎఫ్, సీపీఎం చెరో సీట్లో గెలుపొందగా, స్వతంత్రులు 3 నియోజకవర్గాల్లో గెలిచారు.  

బీజేపీకి 23%, పీడీపీకి 22.7%, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 20.8%, కాంగ్రెస్‌కు 18% ఓట్లు లభించాయి. రెండు స్థానాల్లో పోటీ చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా సోనావర్  స్థానంలో ఓటమి పాలై.. బీర్వా సీటును కేవలం 1,000 ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. ఓడిన ప్రముఖుల్లో ఒమర్ మంత్రివర్గంలోని కాంగ్రెస్ నేత అబ్దుల్ రాథర్ ఒకరు. 1977 నుంచి పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తూ వచ్చిన రాథర్ తొలిసారి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిచిన ముఖ్యుల్లో పీడీపీ ముఖ్యనేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్(అనంత్‌నాగ్), జేకే బ్యాంక్ మాజీ చైర్మన్ హసీబ్ ద్రాబు(పుల్వామా) తదితరులున్నారు.  

ఒమర్ ముఖ్యమంత్రి పదవికి  బుధవారం రాజీనామా చేయనున్నారు. కాగా అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పీడీపీ సంకట పరిస్థితి ఎదుర్కొంటోంది. బీజేపీతో పీడీపీకి సైద్ధాంతిక వైరుధ్యాలున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వడంతో.. ఆ పార్టీతోనూ కలిసే పరిస్థితులపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం  సాగుతోంది. కశ్మీర్, జార్ఖండ్‌లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటవుతాయని ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు.

కాగా, కశ్మీర్‌లోయలో బీజేపీ తరఫున పోటీ చేసిన వారిలో ఒక్కరు మినహా అం దరూ డిపాజిట్లు సైతం కోల్పోవడం అక్కడ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. లోయలోని 46 సీట్లలో 34 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలిపింది. హబ్బా కదల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మోతీ కౌల్ మాత్రమే 2,596 ఓట్లు సాధించి డిపాజిట్ నిలుపుకున్నారు. కశ్మీర్ ఎన్నికల్లో 47,652 మంది ఓటర్లు నోటా (నన్ ఆఫ్ ద ఎబౌ-పైన పేర్కొన్న ఎవరికీ కాదు) గుర్తుకు ఓటేశారు.

సుస్థిర ప్రభుత్వం దిశగా.. జార్ఖండ్
రాష్ట్రం ఏర్పడిన 14 ఏళ్ల తరువాత.. ఇన్నాళ్లూ అస్థిర ప్రభుత్వాల ప్రతికూల ప్రభావాలను చవిచూసిన జార్ఖండ్ ప్రజలు సుస్థిర ప్రభుత్వానికి ఓటేశారు. ప్రచారంలో మోదీ వాడిన అభివృద్ధి మంత్రం కూడా పనిచేసి 81 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 37, ఆ పార్టీ మిత్రపక్షం ఏజేఎస్‌యూ 5 సీట్లు గెలుచుకున్నాయి. అధికార జేఎంఎం 19 సీట్లలో, కాంగ్రెస్ 6, జేవీఎం 8 స్థానాల్లో గెలుపొందాయి. 2009 ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో అంతకు రెట్టింపునకు పైగా స్థానాలు గెలుచుకోవడం విశేషం.

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జేఎంఎం నేత, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బారైత్ స్థానం నుంచి 24 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు. కానీ సిటింగ్ స్థానమైన దుమ్కాలో ఓటమి పాలయ్యారు. ఆయన మంత్రివర్గంలోని 9 మంది ఓడిపోయారు. జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ  నేతృత్వంలోని జేవీఎం(పీ) 8 స్థానాల్లో గెలుపొందింది. కానీ మరాండీ గిరిధ్ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు జేడీయూ, ఆర్జేడీలు ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 31.4%, జేఎంఎం 20.5%, జేవీఎం(పీ) 10%, కాంగ్రెస్ 10.3% ఓట్లు సాధించాయి.

బీజేపీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఖార్సావన్ స్థానం నుంచి ఓటమి పాలు కాగా, మరో కీలక నేత, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్ జంషెడ్‌పూర్ నుంచి గెలుపొందారు. ఏజేఎస్‌యూ అధినేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుదేశ్ మహతో సిలీ స్థానం నుంచి, మరో మాజీ ముఖ్యమంత్రి, జైభారత్ సమతా పార్టీ చీఫ్ మధు కోడా మాఝ్‌గావ్‌లో ఓడిపోయారు. ఆయన భార్య గీతా కోడా జగంత్‌పూర్ నుంచి గెలుపొందారు.

మొత్తంమీద సీఎంలుగా పనిచేసిన నలుగురు, ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం విశేషం. అర్జున్ ముండా (బీజేపీ), తారాచంద్ (మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్), బాబూలాల్ మరాండి(జార్ఖండ్ వికాస్ మోర్చా), హేమంత్ సోరెన్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), మధుకోడా (జయభారత్ సమతా పార్టీ), ఏజేఎస్‌యూ పార్టీ అధినేత, మాజీ డిప్యూటీ సీఎం సుదేశ్ కుమార్ ఓడిపోయిన వారిలో ఉన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం మంగళవారం ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు