విషాదం : మాజీ సీఎం కుమారుడి అనుమానాస్పద మృతి

11 Feb, 2020 20:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు షుబన్సో అనూహ్య రీతిలో మరణించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో ఫుల్‌  (20) అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినట్లు కుటుంబ వర్గాలు మంగళవారం తెలిపాయి. దీంతో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన కలిఖో ఫుల్‌ ఇంట్లో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిఖో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కుమారుడైన షుబాన్సో సస్సెక్స్‌లోని బ్రైటన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించడం కుటుంబ వర్గాలను కలవరపర్చింది. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూకేలోని భారత హైకమిషన్‌తో సంప్రదిస్తున్నామని తెలిపారు.

కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావంటూ 2015 ఏప్రిల్‌లో షో కాజ్‌ నోటీసు కూడా యివ్వకుండా  కాంగ్రెస్‌ పార్టీ  ఫుల్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించడంతో 19 ఫిబ్రవరి 2016న 30మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఈ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆవేదనకు లోనైన ఫుల్‌ ఆగస్టు 9, 2016 న నీతి విహార్‌లోని తన అధికారిక నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఒక విషాదం. ఈ సందర్భంగా రాష్ట్రంలోచోటుచేసుకున్న భారీ అవినీతిపై ''మేరే విచార్‌'' (నా ఆలోచనలు) పేరుతో అనే 60 పేజీల సూసైడ్‌ నోట్‌ రాశారు. ఈ నోట్‌లో పేర్కొన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ మొదటి భార్య డాంగ్‌విమ్సాయ్ పుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన మూడవ భార్య దాసాంగ్లు విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు