ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు నోటీసులు..

13 Jan, 2020 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌, వాట్సాప్‌ సంభాషణలను నిక్షిప్తం చేయాలని కోరుతూ ముగ్గురు జేఎన్‌యూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు నోటీసులు జారీ చేసింది. హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌, వాట్సాప్‌ సంభాషణలను నిక్షిప్తం చేయాలని తాము ఇప్పటికే జేఎన్‌యూలో సంబంధిత అధికారులను కోరగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. కేసుకు సంబంధించిన ఇరు పక్షాల వివరాలు తెలపాలని తాము వాట్సాప్‌కు లేఖ రాశామని, స్పందన కోసం వేచిచూస్తున్నామని చెప్పారు.

కాగా, జేఎన్‌యూలో​ చెలరేగిన హింసకు సంబంధించి ‘యూనిటీ ఎగనెస్ట్‌ లెఫ్ట్‌’ , ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆరెస్సెస్‌’  వాట్సాప్‌ గ్రూపుల డేటాను సెక్యూర్‌ చేయాలని డిలీట్‌ అయిన పక్షంలో ఆ డేటాను తిరిగి పొందాలని వాట్సాప్‌, గూగుల్‌, యాపిల్‌లకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జేఎన్‌యూ ప్రొఫెసర్లు అమిత్‌ పరమేశ్వరన్‌, అతుల్‌ సూద్‌, శుక్లా వినాయక్‌ సావంత్‌లు ఈనెల 10న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ దిశగా ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌, ఢిల్లీ ప్రభుత్వాలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్లు కోర్టును కోరారు.

మరిన్ని వార్తలు