ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్: రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు

29 Nov, 2023 16:53 IST|Sakshi

ఉత్తరకాశీ: సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు బుధవారం తరలించారు. అక్కడ కార్మికులకు అన్ని రకాల మెడికల్ చెకప్‌లను నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చినూక్ హెలికాఫ్టర్‌లో 41 మంది కార్మికులను రిషికేశ్‌కు తరలించారు. గత 17 రోజులుగా సొరంగంలోనే చిక్కుకున్న నేపథ్యంలో కార్మికులకు ఏమైనా ఇన్‌ఫెక్షన్‌లు సోకాయా? అని వైద్యులు పరీక్షించనున్నారు. 

కార్మికులను సొరంగం నుంచి రక్షించిన తర్వాత స్థానికంగా ఉన్న చిన్యాలిసౌర్ ఆస్పత్రికి కార్మికులను తరలించారు. బుధవారం తెల్లవారుజామున, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా కార్మికులను కలిశారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. తదుపరి పరీక్షల కోసం ఎయిమ్స్‌కు తరలిస్తామని వెల్లడించారు. 

కార్మికులను రక్షించడానికి కీలక సహాయం అందించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను కూడా పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం కార్మికుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. 

నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్‌క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్‌ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. 

ఇదీ చదవండి:41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ

మరిన్ని వార్తలు