‘ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టకపోతే శ్రీరాముడైనా గెలవలేడు’

27 Sep, 2018 13:36 IST|Sakshi

పనాజీ : ‘ఈ రోజుల్లో రాముడైనా సరే డబ్బులు పంచకపోతే ఎన్నికల్లో గెలవలేడు’ అంటూ గోవా ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుభాష్‌ వెలింకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో యువతను ఉద్దేశిస్తూ నిర్వహించిన ‘గోవా సురక్ష మంచ్‌’ కార్యక్రమానికి సుభాష్‌ వెలింకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘ఎన్నికలు వస్తున్నాయి.. ఓటర్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్న యువత, మహిళలే నాయకులకు ముఖ్యం. వారిని ఆకట్టుకోవడానికి పార్టీలు ఎంత డబ్బునైనా ఖర్చు పెడతాయి. అయినా ఇప్పటి రాజకీయాలన్ని డబ్బు చూట్టే తిరుగుతున్నాయి. డబ్బు లేకపోతే గెలవడం చాలా కష్టం. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే స్వయంగా శ్రీరాముడే వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా.. డబ్బు పంచకపోతే ఆయన కూడా గెలవడు’ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన గోవా ముఖ్యమంత్రిపై, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ పార్టీ తన విలువలను కోల్పొతుంది. అది కూడా తక్కిన పార్టీలతోవలోనే నడుస్తుందని ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ను ఉద్దేశిస్తూ పారికర్‌ అనారోగ్యంతో ఉన్న ఇద్దరు మంత్రులను తొలగించారు. ఇప్పుడు ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి ఆయన మాత్రం ఎందుకు తన పదవి నుంచి వైదొలగటం లేదని ప్రశ్నించారు. అంతేకాక నాయకులు చిన్న జబ్బుల చికిత్స కోసం కూడా అమెరికా వెళ్లడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు