వెంటిలేటర్‌పై సోమ్‌నాథ్‌ చటర్జీ

13 Aug, 2018 03:17 IST|Sakshi
సోమ్‌నాథ్‌ చటర్జీ

కోల్‌కతా: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ(89)ని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నెల ఛటర్జీకి మెదడులో రక్తస్రావం కావడంతో వైద్యశాలలో చేర్పించారు. చాలా రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నట్లుగా కనిపించడంతో గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి పంపారు. మళ్లీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఆయనను మూడు రోజులకే తిరిగి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ‘ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నాం.

ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు గుండె సహకరించదు. దీంతో ఆయనకు ఆదివారం ఉదయం చిన్నగా గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఫరవాలేదు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని వైద్యులు చెప్పారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.

మరిన్ని వార్తలు