కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

22 Aug, 2018 11:16 IST|Sakshi
కేంద్ర మాజీ మంత్రి గురదాస్‌ కామత్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గురుదాస్‌ కామత్‌(63) బుధవారం కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. న్యాయ విద్యనభ్యసించిన కామత్‌ 1984లో ముంబై నార్త్‌ ఈస్ట్‌ నియోజక వర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.

ఐదు పర్యాయాలు ఎంపీగా..
ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన (1984, 91, 98, 2004, 2009) కామత్‌.. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో 2009- 11 వరకు ప్రసార, సమాచార శాఖ మంత్రిగా, హోం శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు. జూలై 2011లో తన పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ముంబై కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా.. రాజస్తాన్‌, గుజరాత్‌, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2017లో పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు.

కాగా గురదాస్ కామత్‌ మరణం పట్ల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గురుదాస్‌ కామత్‌ జీ ఆకస్మిక మరణం కాంగ్రెస్‌ పార్టీ కుటుంబానికి పెద్ద దెబ్బ. ముంబైలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కామత్‌ జీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు అశోక్‌ గెహ్లాట్‌, రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా తదితరులు కూడా సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు