కాల్పుల విరమణకు తూట్లు

14 Jun, 2018 02:10 IST|Sakshi

పాకిస్తాన్‌ కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మృతి

దీటుగా బదులిస్తాం: బీఎస్‌ఎఫ్‌  

జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత బలగాలు లక్ష్యంగా మంగళవారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఓ అసిస్టెంట్‌ కమాండెంట్‌ ర్యాంక్‌ అధికారి సహా నలుగురు సరిహద్దు భద్రతాదళం(బీఎస్‌ఎఫ్‌) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయమై బీఎస్‌ఎఫ్‌ పశ్చిమ కమాండ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌(ఏడీజీ) కేఎన్‌ చౌబే స్పందిస్తూ.. ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు భారత్‌ అంగీకరిస్తే, పాకిస్తాన్‌ మాత్రం దానికి తూట్లు పొడిచింది. పాక్‌ చేయాల్సింది చేసింది. ఈ నమ్మక ద్రోహానికి దీటుగా స్పందించడం ఇప్పుడు మావంతు’ అని వ్యాఖ్యానించారు.

సాంబా జిల్లాలోని రామ్‌గఢ్‌ సెక్టార్‌లో ఉన్న ఛామ్లియాల్‌ బోర్డర్‌ పోస్ట్‌కు రక్షణ సామగ్రిని తీసుకెళ్తున్న బీఎస్‌ఎఫ్‌ బృందంపై పాక్‌ రేంజర్లు మంగళవారం రాత్రి 9.40 గంటలకు ఏకపక్షంగా కాల్పులు జరిపారన్నారు. దీంతో వీరిని రక్షించేందుకు అసిస్టెంట్‌ కమాండెంట్‌ జితేందర్‌ సింగ్‌ బృందం అక్కడికి చేరుకోగానే పాక్‌ బలగాలు వెంటనే మోర్టార్లను ప్రయోగించాయన్నారు. ఈ దాడిలో బీఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ జితేందర్‌ సింగ్‌(రాజస్తాన్‌)తో పాటు ఎస్సై రజ్‌నీశ్‌ కుమార్‌(యూపీ), ఏఎస్సై రామ్‌నివాస్‌(రాజస్తాన్‌), కానిస్టేబుల్‌ హన్స్‌రాజ్‌(రాజస్తాన్‌) ప్రాణాలు కోల్పోయినట్లు చౌబే తెలిపారు. పాక్‌ కాల్పుల్లో గాయపడ్డ ఐదుగురు జవాన్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామన్నారు. పాక్‌ కాల్పులు బుధవారం తెల్లవారుజాము 4.30 గంటలవరకూ కొనసాగాయనీ, భారత బలగాలు పాక్‌ దాడిని దీటుగా తిప్పికొట్టాయన్నారు. దీనిపై పాక్‌కు నిరసన తెలియజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు