'ఫ్రీడం 251'కు ఐదుకోట్ల రిజిస్ట్రేషన్లు!

20 Feb, 2016 11:48 IST|Sakshi
'ఫ్రీడం 251'కు ఐదుకోట్ల రిజిస్ట్రేషన్లు!

న్యూఢిల్లీ: కేవలం రూ. 251కే అమ్ముతామని చెప్తూ ముందుకొచ్చిన 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్ చుట్టూ ఎన్ని సందేహాలు ముసురుతున్నా.. రిజిస్ట్రేషన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. అంత తక్కువ ధరకు అసలు ఇస్తారా? లేదా? అని ఎన్ని ప్రశ్నలు చుట్టుముడుతున్నా.. దానిని కొనాలన్న ప్రజల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఆన్‌లైన్‌లో ముందస్తు బుకింగ్‌ కోసం కేవలం రెండురోజుల్లోనే ఐదు కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయని రింగింగ్ బేల్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ముందుగా 25 లక్షల 'ఫ్రీడం 251' ఫోన్లను ప్రజలకు అందించాలని కంపెనీ నిర్ణయించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంకా కొనసాగించాలా? వద్దా? అనేది పునరాలోచిస్తున్నట్టు రింగింగ్‌ బేల్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా తెలిపారు. ఈ కారుచౌక మొబైల్ ఫోన్ ముందస్తు బుకింగ్ కోసం ఈ నెల 21వ తేదీ రాత్రి 8 గంటలవరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తెరిచి ఉంచాలని కంపెనీ మొదట నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఐదు కోట్లకు రిజిస్ట్రేషన్లు చేరిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ ఇంకా కొనసాగించాలా? వద్దా? అన్నది ఆలోచిస్తున్నామని అశోక్ చద్దా చెప్పారు. అత్యాధునిక త్రీజీ ఫీచర్స్ తో, ఆధునిక హంగులతో 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్‌ ను రూ. 251కే అందిస్తామని ప్రకటించి మొబైల్ ఫోన్ మార్కెట్‌లో రింగింగ్ బేల్స్ కంపెనీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. నరేంద్రమోదీ తలపెట్టిన 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే తాము కారుచౌక ధరకు మొబైల్ ఫోన్ అందివ్వనున్నట్టు ఆ కంపెనీ చెప్పుకొస్తున్నది.
 

మరిన్ని వార్తలు