గౌరీ లంకేశ్‌ వారసులు ఎవరు?

9 Sep, 2017 11:19 IST|Sakshi
గౌరీ లంకేశ్‌ వారసులు ఎవరు?
సాక్షి, బెంగళూర్‌: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యానంతరం మొదలైన రాజకీయ దుమారం ఓవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు టాబ్లాయిడ్‌ ఈ వారం ఎడిషన్‌ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో  పేపర్‌ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రముఖ టాబ్లాయిడ్‌ 'గౌరీ లంకేశ్‌ పత్రికె' కొనసాగుతుందా? లేక మూతపడుతుందా?..  కొనసాగిస్తే తర్వాతి పగ్గాలు(ఎడిటర్‌గా బాధ్యతలు) చేపట్టేది ఎవరు? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
 
శుక్రవారం బసనవగుడిలోని పత్రిక ప్రధాన కార్యాలయంలో టాబ్లాయిడ్‌ ఎడిటోరియల్‌ సభ్యులు సమావేశమై ఈ అంశం పైనే చర్చించినట్లు సమాచారం. అయితే తాము కేవలం సెప్టెంబర్‌ 12న  మేడమ్‌(గౌరీ లంకేశ్‌) కోసం ‘నాను గౌరీ(నేను గౌరీ)’  పేరిట నిర్వహించబోయే స్మారక సభ ఏర్పాట్ల గురించి చర్చించామని సభ్యులు పైకి చెబుతున్నారు.  
 
‘ప్రస్తుతం ఏడుగురు ఉద్యోగులు ఈ వీక్లీ పేపర్‌లో పని చేస్తున్నారని, వీరిలో ఇద్దరు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులు. మేడమ్‌ కుటుంబ సభ్యులతో కూర్చుని సంప్రదింపులు చేశాకే పేపర్‌ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటామని.. కానీ, అది ఇప్పుడే జరగకపోవచ్చు‘ అని గిరీశ్‌ తలికట్టే వెల్లడించారు. గౌరీ నిర్వహించిన ఉద్యోగ అనే సంచికకు గిరీశ్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
 
‘గౌరీ కటుంబ సభ్యులు షాక్‌లో ఉన్నారు. వారు తేరుకోవటానికి మరికొంత సమయం పడుతుంది. పత్రిక కొనసాగాలని సన్నిహితులు కోరుకుంటున్నారు. కానీ, అందుకు మరికొంత సమయం పట్టవచ్చు’ అని సతీష్ అనే మరో ఉద్యోగి తెలిపారు.  2005లో గౌరీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాక సతీశ్‌ గౌరీ వెంట నిలిచారు. 
 
ఇక పబ్లికేషన్‌ కాలమ్నిస్ట్‌, 1980 నుంచి గౌరీ ఫ్యామిలీతో మంచి సంబంధాలున్న చంద్రే గౌడ మాత్రం టాబ్లాయిడ్‌ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణానికి పత్రికె కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కాబట్టి వారు ఇక దాన్ని కొనసాగించే అవకాశాలు చాలా తక్కువ అని ఆయన చెబుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు టాబ్లాయిడ్‌ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సమయంలోనే పత్రికె కొనసాగుతుందా? అని తనకు అనిపించేదని గౌడ తెలిపారు.
 
అయితే ఏది ఏమైనా హిందుత్వ సంఘాలకు సింహ స్వప్నంగా మారిన లంకేశ్‌ పత్రికె కొనసాగితీరుతుందని గౌరీ లంకేశ్‌ సన్నిహితులు శివ సుందర్‌ చెబుతున్నారు. వారి (హిందుత్వ సంఘాలు) ఆగడాలకు వ్యతిరేకంగా కథనాలు రాసినందుకే ఆమెకు హెచ్చరికలు పంపారు. ఈ క్రమంలోనే గౌరీని హత్య కూడా చేశారంటూ సుందర్‌ ఆరోపించారు.
>
మరిన్ని వార్తలు