బుర్కాతో విద్యార్థినులు.. అడ్డుకున్న యాజమాన్యం

13 Sep, 2019 12:42 IST|Sakshi

ఫిరోజాబాద్ : బుర్కా వేసుకున్న కొంతమంది విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించని ఘటన శుక్రవారం ఫిరోజాబాద్ ఎస్‌ఆర్‌కె కాలేజీలో చోటుచేసుకుంది. బుర్కాలు వేసుకోవడం యూనిఫాంలో భాగం కానందున వాటిని నిషేదించినట్లు కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.'బుర్కా ధరించి లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే తనని అడ్డుకున్నారు. ఇంతకు ముందు చాలాసార్లు బుర్కా వేసుకొని వచ్చినా ఎప్పుడా ఇలా జరగలేదని, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో అర్థం కావడం లేదని' సదరు విద్యార్థిని వాపోయారు.

ఇదే విషయమై కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రభాస్కర్‌ రాయ్‌ మాట్లాడుతూ... మా కాలేజీలో చదివే ఏ విద్యార్థి అయినా తప్పనిసరిగా యూనిఫామ్‌, ఐడీ కార్డ్‌ ధరించాల్సి ఉంటుందని వెల్లడించారు. కాలేజీలో అడ్మిషన్‌ ప్రక్రియ జరుగుతున్నందున రూల్స్‌ పాటించలేదని, కానీ సెప్టెంబర్‌ 11న అడ్మిషన్‌ ప్రక్రియ ముగియడంతో బుర్కా వేసుకున్న విద్యార్థినులను లోనికి అనుమతించలేదని పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయం  నా దృష్టికి వచ్చిందని,  ఇది ఆ కాలేజీ అంతర్గత వ్యవహారమని వెల్లడించారు. కాలేజీ నిబందనల మేరకే విద్యార్థినులు యూనిఫాం, ఐడీ కార్డ్‌ వేసుకొని రావాల్సిందిగా తెలిపిందని , కానీ బుర్కాలు తొలగించాలని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. కాలేజీ విధించిన నిబంధనలను విద్యార్థులందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు