పెళ్లి మంత్రాలు చెప్పలేని వరుడిని వదిలేసి..

15 Dec, 2015 17:47 IST|Sakshi
పెళ్లి మంత్రాలు చెప్పలేని వరుడిని వదిలేసి..

లక్నో:  ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మైనర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సరియైన  జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో  తెలివిగా వ్యవహరించింది.  పెళ్లి తంతులో మంత్రాలు సరిగా వల్లించలేని వరుడిని కాదని,  సొంత గ్రామానికి చెందిన రైతును సంతోషంగా పెళ్లాడింది.  తల్లిదండ్రులు,  బంధువులు, గ్రామస్తుల సమక్షంలో ఈ  వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

వివరాల్లోకి వెళ్లితే మణిపూరి జిల్లాకు చెందిన గులియాపూర్కు చెందిన ఖుష్బూ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి మంటపంలో బాజా భజంత్రీలు జోరుగా మోగుతున్నాయి. ఇక మూడు ముళ్లు పడడమే  తరువాత. ఇంతలో పెళ్లి కొడుకు యవ్వారం గురించి పెళ్లి కూతురి  చెవిలో  వేసారు ఆమె స్నేహితులు. ఇది విని షాకైన ఖుష్బూ స్వయంగా తానే రంగంలోకి దిగింది. 

 

పెద్దలు వారిస్తున్నా వినకుండా...ధైర్యంగా  ముందుకెళ్లి అతగాడికి కొన్ని పరీక్షలు పెట్టింది.  లెక్కల పరీక్షలో  ఫెయిలైన  సదరు పెళ్లికొడుకు కనీసం మొబైల్లో నెంబర్ను డయల్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యాడు.  దీంతో  కనీస విద్యార్హత  కూడా లేదని, మానసికంగా కూడా దృఢంగా లేని వ్యక్తిని పెళ్లి చేసుకోనంటూ ఆ  వివాహాన్ని రద్దు చేసుకుంది.  

తనకు చదువంటే చాలా యిష్టమంటున్న  ఖుష్బూ ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతోంది. టీచర్ కావాలనేది ఆమె కోరిక.  చదువు సంధ్యాలేని మొద్దుకంటే  పదో తరగతి చదువుకొని,   గౌరవంగా  గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న తెలివైన  రైతే మేలని  భావించింది. అందుకే  ఆనందంగా స్థానిక  యువకుడు అమిత్(21) ను ఆనందంగా మనువాడింది.

మరిన్ని వార్తలు