'వేరేవాళ్లకు ఎందుకు? ఆ క్రెడిట్ మీకే వస్తుందిగా!' | Sakshi
Sakshi News home page

'వేరేవాళ్లకు ఎందుకు? ఆ క్రెడిట్ మీకే వస్తుందిగా!'

Published Tue, Dec 15 2015 4:40 PM

'వేరేవాళ్లకు ఎందుకు? ఆ క్రెడిట్ మీకే వస్తుందిగా!' - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీని మీరే ఎందుకు శుభ్రం చేయకూడదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాయుకాలుష్యం పెరిగిపోవడంపట్ల దాఖలైన పలు పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఒక ఆలోచనకు వచ్చి కలిసి పనిచేసి ఢిల్లీని ఎందుకు బాగుచేయకూడదని ప్రశ్నించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ మంచి పేరు మీరే మూటకట్టుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించింది.

ఢిల్లీలో డీజిల్ కార్లను నిషేధించేలా అనుమతించాలంటూ ప్రభుత్వం తరుపున, అలా వీల్లేదంటూ ప్రజల తరుపున కొందరు వ్యక్తులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చివరకు ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది కదా అని పేర్కొంది.

'మీరే ఆదర్శంగా నిలవొచ్చు. అందుకు అనుగుణమైన పరిపాలనతో ముందుకు వెళ్లవచ్చు. ఎందుకు మీరు ఆ పని చేయకూడదు. ఢిల్లీని స్వచ్ఛంగా మార్చి ఆ క్రెడిట్ తీసుకోండి. ఈ సదావకాశాన్ని ఎందుకు వదులుకుంటారు' అని కోర్టు వ్యాఖ్యానించింది. గత వారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ ఠాకూర్ కూడా ఢిల్లీలో వాయుకాలుష్యంపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ పరిస్థితి చెప్పడానికి వీల్లేనంతగా తయారైందన్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎక్కువ కాలుష్యాన్ని మూటగట్టుకున్న నగరంగా పేర్గాంచిందని, అంతకుముందు అంతర్జాతీయ న్యాయస్థానానికి చెందిన ఓ న్యాయమూర్తి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పామని, అలా చెప్పాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు.

Advertisement
Advertisement