ప్రభుత్వ నిధులు ఇప్పుడు కాదు

16 Dec, 2015 02:22 IST|Sakshi
ప్రభుత్వ నిధులు ఇప్పుడు కాదు

ఎన్నికల వ్యయంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ జైదీ
♦ కఠిన చట్టాల ద్వారానే పారదర్శకత
♦ పార్టీల నిధుల సేకరణలోనే అసలు సమస్య
 
 న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికలకు ప్రభుత్వమే నిధులిచ్చేలా మార్పులు తీసుకు రావటానికి ఇది సరైన సమయం కాదని.. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ‘ఎన్నికల్లో డబ్బు ఖర్చు, ప్రజాప్రాతినిధ్యంపై దీని ప్రభావం’అంశంపై జరిగిన దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సదస్సులో జైదీ ప్రారంభోపన్యాసం చేశారు. ముందుగా నేరమయ రాజకీయ వ్యవస్థను లేకుండా చేయటం.. పార్టీలు, అభ్యర్థుల నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవటం, రాజకీయాల్లో అవినీతి, ఆ నిధుల తనిఖీ చేసేందుకు కఠినమైన చట్టాలు చేసి వేగవంతంగా అమలు చేసేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత విధానంలో మార్పు రానంతవరకు ప్రభుత్వ నిధులతో ఎన్నికలు నిర్వహిస్తే (ఎన్నికల ఖర్చుకోసం పార్టీలు, అభ్యర్థులకు ప్రభుత్వమే నిధులివ్వటం) అది పార్టీలకు.. తప్పు చేసేందుకు మరో అవకాశం ఇచ్చినట్లేనన్నారు.

 జైదీ ఇంకా ఏమన్నారంటే..
► ప్రస్తుతం పార్టీల నిధుల సేకరణ విధానంతో నల్లధన నివారణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అక్రమంగా నిధులు ఎన్నికల ప్రక్రియలోకి వచ్చేస్తున్నాయి.  మెజారిటీ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలివ్వటం లేదు. రాజకీయ నిధుల విషయంలో.. సరైన చట్టాలు లేకపోవటంతో భయంకర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
► పెయిడ్ న్యూస్ రూపంలో ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తున్నారు. చర్యలు తీసుకుందామన్నా.. చట్టంలో ఉన్న లొసుగులతో తప్పించుకుంటున్నారు.
► ఎన్నికల ట్రస్టుల ద్వారా పార్టీలకు నిధులు పెరుగుతున్నాయి. ఈ ట్రస్టులు.. ప్రభుత్వ సంస్థలనుంచి తప్ప.. ఏ ఇతర సంస్థ నుంచైనా లెక్కలేనన్ని నిధులు స్వీకరించవచ్చు. పార్టీలకు ఎన్ని నిధులైనా ఈయవచ్చు. ఈ ట్రస్టులకు వర్తించే నియమ నిబంధలను ప్రజాప్రాతినిధ్య చట్టం కిందికి రావు. విదేశాలనుంచీ నిధులు ఈ ట్రస్టులకు వస్తున్నాయి.
► వివరాలు అందించని అభ్యర్థులు, పార్టీలకు జరిమానా వేసి చేతులు దులుపుకోవటం తప్ప ఎన్నికల సంఘం ఏమీ చేయలేదు.
► ఎక్కువ డబ్బులు ఖర్చుచేస్తున్న పార్టీలకే ఎక్కువ విజయావకాశాలుండే పరిస్థితి. దీంతో.. ‘క్విడ్ ప్రో కో’ విధానంలో.. పార్టీలకు నిధులివ్వటం. వాళ్లు అధికారంలోకి వచ్చాక.. డబ్బులిచ్చిన వాళ్లు ప్రతిఫలాలు తీసుకోవటం వల్ల సమాజంలో సమస్యలు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు