వాట్సాప్‌ స్టేటస్‌గా గర్ల్‌ ఫ్రెండ్‌ డెడ్‌బాడీ ఫొటో!

3 Dec, 2023 06:14 IST|Sakshi

చెన్నై: గర్ల్‌ ఫ్రెండ్‌ను గొంతు పిసికి చంపేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహం ఫొటోను తీసి వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. మృతురాలి స్నేహితులు గుర్తు పట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో అతగాడు దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లంకు చెందిన ఫౌసియా(20) చైన్నైలోని ఓ హాస్టల్‌లో ఉంటూ క్రోంపేట్‌లోని కాలేజీలో నర్సింగ్‌ చదువుతోంది. ఆషిక్‌(20)అనే యువకుడితో అయిదేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. మైనర్‌గా ఉన్నప్పుడే ఫౌసియా గర్భవతి అయింది.

ఆషిక్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఫౌసియా పుట్టిన బిడ్డను దత్తతకిచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆషిక్, ఫౌసియా సంబంధం తిరిగి కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై వచ్చిన ఆషిక్‌ హోటల్‌లో రూం బుక్‌ చేసి, ఫౌసియాను వెంట తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం, మృతదేహం ఫొటోను తన వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. ఫౌసియా స్నేహితులు ఆ ఫొటోను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి హోటల్‌ రూంలో చూడగా ఫౌసియా మృతదేహం కనిపించింది. పరారీలో ఉన్న ఆషిక్‌ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. తనకు మరో యువతితో సంబంధముందని అనుమానిస్తూ మాట్లాడటంతో కోపం పట్టలేక ఫౌసియాను టీ షర్టుతో గొంతుకు బిగించి, చంపేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.

మరిన్ని వార్తలు