‘ఆ ఇల్లు ముమ్మాటికి మనదే’

24 Jul, 2018 20:39 IST|Sakshi
దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా నివాసం

న్యూఢిల్లీ : ముంబై సమీపంలోని మలబార్ హిల్ ప్రాంతంలోని పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ఇల్లు భారత ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్‌ స్పష్టం చేశారు. జిన్నా ఇంటి ప్రస్తుత పరిస్థితి గురించి కర్నాల్‌ ఎమ్‌పీ అశ్విన్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఇలా స్పందించారు.  లోక్‌సభలో ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా నివాసం భారత ప్రభుత్వానికి చెందిన ఆస్తి. ఈ నివాసం ‘ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్’ పరిధిలోకి రాదు. కేవలం శత్రు దేశాలకు చెందిన వారి ఆస్తులు మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. కానీ నిర్వాసిత ఆస్తి చట్టం 1950, ప్రకారం జిన్నా నివాసం ‘శరణార్ధి ఆస్తి’ కిందకు వస్తుందని’ తెలిపారు. ఇలాంటి ఆస్తులపైన వ్యక్తిగతంగా, ట్రస్టీగా, లబ్దిదారుగా ఉన్నా ఎలాంటి హక్కులు ఉండవన్నారు. జిన్నా ఆస్తిని వదిలిపెట్టే ప్రశ్నే తలెత్తదని ఆయన అభిప్రాయపడ్డారు.

జిన్నా 1936లో లండన్‌ నుంచి ముంబై వచ్చారు. దేశ విభజనకు ముందే ముంబై సమీపంలోని మలబార్ హిల్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు జిన్నా. ఈ ఇంటికి ‘సౌత్‌ కోర్టు’ అని పేరు. స్వాతంత్య్ర పోరాట కాలంలో ముస్లీం లీగ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ విభజన కోసం పట్టుబట్టారు. విభజన అంశంపై మహాత్మ గాంధీ, జిన్నా ఈ ఇంటిలోనే 1944, సెప్టెంబర్‌లో చర్చలు నిర్వహించారు. దేశ విభజన అనంతరం జిన్నా పాకిస్తాన్‌ వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మరోవైపు పాకిస్తాన్‌ కూడా జిన్నా ఇంటి మీద దావా వేసింది. ఈ ఇంటి యాజమాన్య హక్కులను గౌరవిస్తూ ఈ ఆస్తిని తమకు అప్పజెప్పాలని భారత్‌ను కోరుతుంది.

మరిన్ని వార్తలు