రాజ్‌భవన్‌లో రాజీవ్‌ బంతి

12 May, 2019 10:08 IST|Sakshi

కేసులు అడ్డుతొలగడంతో ఫైలు ముందుకు

ఏడుగురి విడుదలపై వేగం పెంచిన గవర్నర్‌

వారంలో చట్ట నిపుణుల నివేదిక

సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకుల విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ కొట్టివేశారు. దీంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోగా, రాజీవ్‌ హంతకుల విడుదల ‘బంతి’ మళ్లీ రాజ్‌భవన్‌కు చేరింది. విడుదల చేయాలా వద్దా అనే అంశంలో గవర్నర్‌ వేగం పెరిగింది. ఎన్నికల ప్రచార నిమిత్తం 1991, మే 21న చెన్నై శివారు శ్రీపెరంబుదూరుకు వచ్చిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎల్‌టీటీఈ మానవబాంబు దాడిలో హతమైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురు ఖైదీల ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారగా గత 27 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. యావజ్జీవ శిక్షను అనుసరించి సుదీర్ఘకాలం అయిన కారణంగా ఈ ఏడుగురిని విడుదల చేయాలనే అంశం తెరపైకి వచ్చింది. జయ హయాంలోనే తమిళనాడు ప్రభుత్వం విడుదలకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపింది. అయితే  మరణించిన వారి కుటుంబాలవారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం, గవర్నర్‌కు ఉత్తరాలు రాయడంతో విడుదలలో ప్రతిష్టంభన నెలకొంది. అయితే సుప్రీంకోర్టు ఇటీవలే ఆ పిటిషన్‌ను కొట్టివేయడమేగా, ఇందుకు సంబంధించి ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేనిపక్షంలో ఏడుగురి విడుదలపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది.

వారంలో చట్ట నిపుణుల నివేదిక:
ఇదిలా ఉండగా, రాజీవ్‌ హంతకుల విడుదల ఎంతో సున్నితమైన అంశం కావడంతో గవర్నర్‌ ఆచితూచి అడుగేస్తున్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం తనకు అందగానే నిర్ణయం తీసుకునేందుకు కోర్టులో కేసులు విచారణలో ఉన్నందున ఏ విషయాన్ని ప్రకటించలేదు. అయితే ఇందుకు సంబంధించిన పనులు మాత్రం ఆనాడే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొందరు మేధావులను రాజ్‌భవన్‌కు రప్పించుకుని ఈ విషయంపై చర్చించగా రాజీవ్‌ హంతకుల విడుదల అంశం 20 ఏళ్లుగా నానుతోంది, అనేక ఘట్టాలను అధిగమించింది. న్యాయస్థానాల్లో అనేక కేసులను ఎదుర్కొంది. ఆయా కారణాల వల్ల అంత సులభంగా నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. జాతీయస్థాయిలో ప్రముఖులైన చట్ట నిపుణులు సలహాలను లిఖితపూర్వకంగా తీసుకుని, అందుకు అనుగుణంగా ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవరర్న్‌కు వారు సూచించారు. ఈ సలహామేరకు ప్రముఖ చట్ట నిపుణులను గవర్నర్‌  పురమాయించారు. సుప్రీంకోర్టులోని పిటిషన్‌ అడ్డుకూడా తొలగిపోవడంతో చట్ట నిపుణుల  నివేదిక వారంరోజులు రాజ్‌భవన్‌కు చేరుకుంటుందని విశ్వసనీయ సమాచారం. నివేదిక అందగానే రాజ్‌భవన్‌ నుంచి ఒక ప్రకటన విడుదల కావడం ఖాయమని ఆశిస్తున్నారు.

గవర్నర్‌ మౌనమేల: దురైమురుగన్‌
ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు నుంచి తాజాగా స్పష్టమైన అనుమతులు లభించినా రాజీవ్‌ హంతకుల విడుదలపై గవర్నర్‌ మౌనం పాటించడం ఏమిటని డీఎంకే కోశాధికారి దురైమురుగన్‌ ఆక్షేపించారు. వేలూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌ వ్యవహారశైలి ఎంతో బాధాకరమని, ఇంకా జాప్యం చేసిన పక్షంలో ఆయన హృదయం పాషాణమని భావించాల్సి వస్తుందని అన్నారు. రాజీవ్‌ హంతకుల విడుదల ఆయన జీవిత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు