పైలట్‌ అభినందన్‌కు ‘వీరచక్ర’ పురస్కారం?

8 Aug, 2019 11:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను భారత ప్రభుత్వం ఉన్నత మిలిటరీ పురస్కారంతో సత్కరించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో దాయాది పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని తాను నడుపుతున్న మిగ్‌-21 బిసన్‌ యుద్ధవిమానం నుంచి అభినందన్‌ కూల్చేశారు. ఇందుకుగాను ఆయనకు ‘వీరచక్ర’ పురస్కారం దక్కే అవకాశముందని తెలుస్తోంది.  పరమవీర చక్ర, మహావీర చక్ర పురస్కారాల తర్వాత అత్యున్నత మిలిటరీ పురస్కారం ‘వీరచక్ర’.

బాలాకోట్‌లోని జైషే మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడిచిన ఐదుగురు మిరాజ్‌ 2000 ఫైటర్‌ పైలట్లను కూడా కేంద్రం సత్కరించనుంది. వారి సాహసానికి గుర్తింపుగా వాయుసేన మెడల్స్‌ను బహూకరించనుంది. పాక్‌ యుద్ధవిమానాలతో పోరాడుతూ.. తన మిగ్‌-21 బిసన్‌ యుద్ధవిమానం కూలిపోవడంతో అభినందన్‌ పాక్‌ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాక్‌ చెరలో ఉన్న అభినందన్‌ను.. భారత ప్రభుత్వం తెచ్చిన దౌత్య ఒత్తిడిని తలొగ్గి దాయాది రెండు రోజుల అనంతరం మన దేశానికి అప్పగించింది. గత ఫిబ్రవరి 26న పూల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో భారత సైన్యం వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు