పసిమనసుపై రక్తాక్షరాలు

8 Aug, 2019 11:54 IST|Sakshi

చల్లపల్లి బాలుడి హత్య మిస్టరీలో విస్తుపోయే వాస్తవాలు

పదిహేనేళ్లకే నిందితుడిగా మారిన పదో తరగతి విద్యార్థి

ఆధారాలను మాయం చేసి రోజంతా అమాయకంగా నటన

తీవ్ర ప్రభావం చూపుతున్న సినిమాలు, సోషల్‌ మీడియా 

తెలిసి తెలియని వయసులో విద్యార్థులు తప్పటడుగులు వేస్తున్నారు. క్షణికావేశాలకు లోనై జీవితాలనే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. మధురానుభూతులు నింపుకోవాల్సిన బాల్యంలో హత్యలు చేసి కటకటాల పాలవుతున్నారు. పసి హృదయంలో కర్కశత్వం నింపుకొని అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నారు.

సాక్షి, కృష్ణా :  ఇప్పటి వరకు విద్యా సంస్థల వసతిగృహాల గదుల్లో చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పదిహేనేళ్ల విద్యార్థి తొమ్మిదేళ్ల విద్యార్థిని హత్య చేయడం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే పాఠశాలలో చదివే  మూడో తరగతి విద్యార్థిని క్రూరంగా గొంతు కోసి చంపాడు. చిన్నపాటి వాగ్వాదం నేపథ్యంలో హత్య జరగడం  విస్మయానికి గురిచేస్తోంది. పిల్లలపై నేరప్రవృత్తి ప్రభావంతో మనస్తత్వంలో వస్తున్న మార్పులే ఈ విపరీతాలకు కారణమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కుటుంబ వాతావరణం సరిగాలేక.. 
ప్రపంచంలో మనకు తప్ప మరే దేశానికి లేని గొప్పవరం భారతీయ కుటుంబ వ్యవస్థ. మారుతున్న సమాజ పోకడల నేపథ్యంలో ఈ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం  కూడా ఈ విపరీత ధోరణులకు కారణమవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నాక ఎవరో ఒకరి దగ్గర పెరగడం, పెద్దల పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాలతో పిల్లల మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తున్నాయి. పెద్దల అప్యాయత, అనురాగం లభించక వారిలో సున్నితత్వం లోపిస్తోంది. పిల్లల్లో తెలిసి తెలియని వయసులో మొలకెత్తుతున్న నేరప్రవృత్తిని గుర్తించి, నిలువరించలేకపోవడం కూడా వారు మరింత చెడిపోవడానికి కారణమవుతోంది. అందుకే పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీడియా ప్రభావం.. 
సినిమా, టీవీ, సోషల్‌మీడియాల్లో ప్రసారమవుతున్న హింసాత్మక దృశ్యాలు పిల్లల కంట పడి వారి మానసిక స్థితిలో మార్పును తెస్తున్నాయి. ఇటువంటి దృశ్యాలు చూసిన వీరు కుంగుబాటు, యాంగ్జైటీ, ట్రామటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ వంటి మానసిక సమస్యల బారిన పడతారని అధ్యయనాల్లో తేలింది. బ్లూవేల్‌ గేమ్స్, సిని మాల్లో హింసాత్మక దృశ్యాలు, నిజమైన క్రైమ్‌ సీన్స్‌ను ఆసక్తిగా చూడటానికి ప్రధాన కార ణం సున్నితత్వం సన్నగిల్లడమేనని తెలుస్తోంది. సిని మాల్లో అశ్లీల దృశ్యాలపై సెన్సార్‌షిప్‌ ఉన్నట్లే, శ్రుతి మించిన హింసాత్మక ఘటనలపైనా నిబంధనలు ఉండాలని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. చల్లపల్లి హత్య ఘటనలో నిందితుడైన విద్యార్థి సినిమా ఫక్కీలో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. హత్యకు ఉపయోగించిన చాకు కడగడం, దుస్తులను బ్యాగులో దాచడం, ఏమీ తెలియని అమాయకుడిలా న టించడం ఇవన్నీ చూస్తే తను ఎంతలా ఆలోచించాడో తెలుస్తోంది. ఇలాంటివన్నీ పిల్లలు సినిమాలు, సీరియల్స్‌లో తరుచూ చూసే ఘటనలే.

చదవండి: మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య 

నైతిక విలువలు నేర్పకపోవడమే
పిల్లలు ఎదగాల్సిన రీతిలో ఎదగకపోవడంతో వారిలో యాంటీ సోషల్‌ బిహేవియర్‌ పెరుగుతుంది. ఇది తొలి దశలో గుర్తించకపోవడంతో యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌గా మారుతుంది. సరైన వాతావరణంలో పెరగకపోవడం, తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయతలు దక్కకపోవడం కూడా వారిని కర్కశత్వంగా మారుస్తుంది. ప్రతీకార మనస్తత్వం పెరిగి చిన్నచిన్న గొడవలకు సైతం దాడులు చేసి తప్పు చేస్తున్నారు. వీటిని ప్రాథమిక దశలో కనుగొని నివారించడానికి ప్రతి హాస్టల్, విద్యా సంస్థల్లో సైకాలజిస్ట్‌ను నియమించాలి. వారికి నైతిక విలువలు, క్రమశిక్షణ వంటి విషయాలను నేర్పి మంచి మార్గంలో పయనించేలా చేయవచ్చు.  
– టీఎస్‌ రావు, మానసిక నిపుణుడు, విజయవాడ

పరిపక్వత లేకపోవడమే
13–15 ఏళ్ల మధ్య పిల్లలు మానసిక పరిస్థితి వింతగా ఉంటుంది. పూర్తి పెద్దల మాదిరిగా ఆలోచించరు, పూర్తి పిల్లలవలే ప్రవర్తించరు. మెదడు పూర్తిగా పరిపక్వత చెందని స్థితి. భావోద్వేగాలను నియంత్రించే వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల తీవ్ర ఉద్వేగాలకు లోనై ఏం చేస్తున్నామో తెలియకుండా ప్రవర్తిస్తారు. అటువంటి సమయంలో చుట్టూ ఉన్నవారు గుర్తించి వారికి ఏది మంచో, ఏది చెడో తెలియజెప్పాలి. కొన్నిసార్లు పక్క వారు రెచ్చగొట్టడం వల్ల కూడా వారు నేరాలకు పాల్పడేలా చేస్తాయి. కుటుంబంలో నేర ప్రవృత్తి ఉన్న వారు ఉండటం కూడా వారిని ప్రభావితం చేస్తుంది.
– ఇండ్ల విశాల్, చైల్డ్‌ సైకాలజిస్ట్, విజయవాడ  

మరిన్ని వార్తలు