ప్రభుత్వ సహకారంతోనే చెక్‌: వాట్సాప్‌

5 Jul, 2018 02:37 IST|Sakshi

న్యూఢిల్లీ: నకిలీ వార్తలు, వదంతుల కారణంగా భారత్‌లో తీవ్రమైన హింస చెలరేగడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇలాంటి ఘటనల్ని నివారించేందుకు పలు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. పిల్లల కిడ్నాపర్లంటూ దేశవ్యాప్తంగా పలువురిని అల్లరిమూకలు ఇటీవల కొట్టిచంపిన నేపథ్యంలో నకిలీ వార్తలు, వదంతుల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది. దీంతో నకిలీ వార్తల కట్టడికి తీసుకోనున్న చర్యలపై వాట్సాప్‌ కేంద్ర ఐటీ శాఖకు బుధవారం లేఖ రాసింది.

నకిలీ వార్తలు, వదంతుల్ని ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్త సహకారంతోనే టెక్నాలజీ సంస్థలు ఎదుర్కొనగలవని వాట్సాప్‌ తెలిపింది. ప్రజల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామనీ, అందుకు అనుగుణంగానే యాప్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించింది. నకిలీ వార్తలు, వదంతుల్ని అరికట్టేందుకు ప్రొడక్ట్‌ కంట్రోల్, డిజిటల్‌ లిటరసీ, వార్తల్లోని నిజాలను తనిఖీ చేయడం వంటి పద్ధతుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ పేర్కొంది. అంతేకాకుండా విచారణ సంస్థల విజ్ఞప్తులకు అనుగుణంగా పూర్తి వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామంది.

మరిన్ని వార్తలు