అర్ధరాత్రి 54 మంది ఎమ్మెల్యేల తరలింపు

29 Jul, 2017 14:55 IST|Sakshi
అర్ధరాత్రి 54 మంది ఎమ్మెల్యేల తరలింపు

అహ్మదాబాద్: గుజరాత్‌లో రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రతిపక్ష పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి రాజీనామాలు చేసి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరుతుండటం ఆ పార్టీకి మింగుడుపడనివ్వడం లేదు. దీంతో శుక్రవారం రాత్రి 54 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ బెంగుళూరుకు తరలించింది.

ఎమ్మెల్యేలను బెంగుళూరుకు తరలించడంపై మాట్లాడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పర్మార్‌.. బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు పడిపోకుండా ఉండటం కోసమే వారిని దూరంగా తీసుకెళ్తున్నట్లు చెప్పారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రలోభాలకు పాల్పడుతోందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు ఆఫర్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పునాభాయ్‌ గమిట్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌ నేతల ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. బీజేపీ డబ్బు ఇవ్వజూపుతోందన్న ఆరోపణలపై నవ్వేశారు. కాంగ్రెస్‌ ఓ మునిగిపోయే నావని అన్నారు. మునిగిపోయే షిప్‌లో ఉన్నవారందరూ ఎలాగొలా బయటపడటానికి ప్రయత్నిస్తారని.. ఈ ఆరోపణ కూడా అలాంటిదేనని అన్నారు.

>
మరిన్ని వార్తలు