నల్లగొండ బరిలో సోనియా?

20 Dec, 2023 09:32 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ బరిలో నిలవబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో సోనియాగాంఽధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సోమవారం గాంధీభవన్‌లో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ కాపీని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలిసింది. అయితే పీఏసీ సమావేశంలో సోనియాగాంధీ తెలంగాణలో ఏ జిల్లా నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే చర్చ వచ్చిన సందర్భంలో నల్లగొండ పార్లమెంట్‌ నుంచి పోటీ అంశం కూడా పరిశీలించినట్లు తెలిసింది. దీంతో సోనియాగాంఽఽధీ నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బంపర్‌ మెజార్టీతో విజయం సాధిస్తారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విషయం జిల్లా వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌
నల్లగొండ జిల్లా మొదట్లో కమ్యూనిస్టులకు పుట్టినిల్లు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీని జిల్లా ప్రజలు ఆదరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకే కంచుకోటగా మార్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు గాను బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ తర్వాత మార్చిలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ ఎంపీలుగా ప్రస్తుత మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన జిల్లాగా నిలిచింది

. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో ఒక్క సూర్యాపేట మినహా 11 స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లా ప్రజలు అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులనే గెలిపించి మళ్లీ నల్లగొండను కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో ఉద్ధండులైన నేతలు జిల్లా నుంచే ఉన్నారు. ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో పాటు సీనియర్‌ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డికూడా నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలోనే ఉన్నారు.

భారీ విజయమని..
సోనియాగాంధీ నల్లగొండ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించుకోవచ్చన్న ఆలోచనల్లో జిల్లాలోని సీనియర్‌ నేతలు ఉన్నారు. జిల్లాలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ మేరకు కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో సోనియాగాంధీని నల్లగొండ నుంచి పోటీలో నిలిపేలా ఒప్పిస్తే మరింత భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో పాటు జిల్లా వ్యాప్తంగా జోరందుకుంది. సోనియాగాంఽధీ నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే నల్లగొండ పేరు మళ్లీ చరిత్రలోకి ఎక్కే అవకాశం ఉంది.

అందుకు ఆమెను ఒప్పించడం ద్వారా ఆమె నల్లగొండ నుంచి గెలుపొందడం, అదే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా ఊహించని విధంగా అభివృద్ధికి నోచుకుంటుందనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. ఇందులో భాగంగానే నల్లగొండ నుంచే సోనియాగాంఽధీని పోటీ చేయించాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు, కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆశలు పెట్టుకున్న వారికి ఇతర పదవులు..
ప్రస్తుతం నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట స్థానం నుంచి టికెట్‌ కోసం పటేల్‌ రమేష్‌రెడ్డి పోటీ పడటం, టికెట్‌ను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి దక్కడంతో రమేష్‌రెడ్డికి ఎంపీగా అవకాశం కల్పిస్తామని టీపీసీసీతోపాటు ఏఐసీసీ నేతలు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మరికొందరు బీసీ, ఇతర నేతలు కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినందున పార్లమెంట్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ సోనియాగాంధీ నల్లగొండ నుంచి పోటీ చేస్తే మాత్రం ఆ నేతలకు నిరాశ తప్పదు. అయితే వారి హోదాను బట్టి ప్రభుత్వంలో ఇతర పదవులతో పాటు పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు