పీవోకేలో భారీ భూకంపం 

25 Sep, 2019 03:32 IST|Sakshi
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ధ్వంసమైన ఓ రోడ్డు

మృతులు: 26

క్షతగాత్రులు: 300

రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.8

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో సంభవించిన తీవ్ర భూకంపంతో 26 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌తోపాటు ఉత్తర ప్రాంతంలోని పలు నగరాల్లో భూమి కంపించింది. దీని ప్రభావంతో భారత్‌లో..రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ల్లోనూ భూమి కంపించింది. తీవ్ర ప్రకంపనలు రాకవడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాలు వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. పంజాబ్‌ ప్రావిన్సులోని పర్వత ప్రాంతం జీలం కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాక్‌ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని తీవ్రత 7.1 వరకు ఉందని సైన్స్‌ శాఖ మంత్రి ఫవాద్‌ ఛౌదరి అన్నారు. భూకంప కేంద్రం పీవోకేలోని న్యూ మీర్పూర్‌ సమీపంలో ఉందని అమెరికా తెలిపింది. పీవోకేలోని మిర్పూర్‌లో మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్రంగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

మీర్పూర్‌లో ఓ భవనం కుప్పకూలింది. ఓ మసీదు కూడా దెబ్బతింది. భూకంపంతో మీర్పూర్, చుట్టుపక్కల జరిగిన విధ్వంసంలో 26 మంది మృతి చెందగా, మహిళలు, చిన్నారులు సహా 300 మంది వరకు గాయపడ్డారని మీర్పూర్‌ డీఐజీ గుల్‌ఫరాజ్‌ ఖాన్‌ తెలిపారు. భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయి. పగుళ్లిచ్చిన రోడ్లలో కార్లు ఇరుక్కుపోయాయి. పెషావర్, రావల్పిండి, లాహోర్, ఫైసలాబాద్, సియాల్‌కోట్, అబోటాబాద్, ముల్తాన్, నౌషెరాల్లో భూమి కంపించింది.  పరిపాలనా యంత్రాంగానికి తోడుగా తక్షణమే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పాక్‌ ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావెద్‌ బజ్వా సైన్యాన్ని ఆదేశించారు. వైమానిక దళం, వైద్య బృందాలను పంపినట్లు సైన్యం తెలిపింది. నష్టం ఎక్కువగా మీర్పూర్, జీలం ప్రాంతాల్లో జరిగిందని జాతీయ విపత్తుల నిర్వహణ విభాగం చైర్మన్‌ లెఫ్టినెంట్‌ మొహమ్మద్‌ అఫ్జల్‌ తెలిపారు. అయితే, మీర్పూర్‌ సమీపంలో ఉన్న మంగ్లా జలాశయానికి ఎటువంటి ముప్పు లేదన్నారు. జలాశయం వద్దనున్న 900 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని అధికారులు ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రకంపనల కారణంగా జీలం కాల్వకు గండ్లు పడటంతో నీరు లోతట్టు ప్రాంత గ్రామాలను ముంచెత్తింది.

ఉత్తర భారతంలోనూ అలజడి 
ఉత్తర భారతంలోని దేశ రాజధాని ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో భూకంప తీవ్రత 6.3గా ఉందని అధికారులు ప్రకటించారు. అయితే, ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని వెల్లడించారు. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, హరియాణాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాలను వదిలి రోడ్లపైకి చేరుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు