గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు!

14 Feb, 2017 13:42 IST|Sakshi
గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు!

చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైన తర్వాత తమిళ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శశికళ క్యాంపు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా కె.పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. 'పార్టీ శాసనసభాపక్ష నేతగా నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నా ఎన్నిక గురించి గవర్నర్ కు సమాచారం అందించాను. నాకు 119 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని తెలియజేశాను. గవర్నర్ ను కలిసి మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు లేఖ సమర్పిస్తాను. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించామని' పళనిస్వామి వివరించారు.

గవర్నర్ నుంచి పిలుపు వస్తే మెజార్టీ ఎమ్మెల్యేలతో వెళ్లి కలువనున్నట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత సభలోనూ తన మెజార్టీ నిరూపించుకుంటానని ఆయన ధీమాగా ఉన్నారు. తంబిదురై, సెంగొట్టయన్‌ తాజాగా జయలలిత మేనళ్లుడు దీపక్‌ జయకుమార్‌ పేర్లు కూడా పరిశీలనలోకి రాగా చివరికి కె.పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్నారు. సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.