మరో పాక్‌ విమానం కూల్చివేత!

4 Mar, 2019 19:38 IST|Sakshi

జైపూర్‌ : భారత్‌- పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల తగ్గుముఖం పట్టినట్లుగా కన్పిస్తున్న తరుణంలో సరిహద్దుల వెంబడి మరోసారి అలజడి చెలరేగింది. ఇప్పటికే కశ్మీర్‌ సరిహద్దుల వెంబడి పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్‌ మరో దుందుడుకు చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లోని భారత్- పాక్‌ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్‌ను భారత వైమానిక దళం కూల్చివేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం భారత గగన తలంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్తాన్‌ డ్రోన్‌పై... భారత ఫైటర్‌ జెట్‌ సుఖోయ్‌ 30ఎమ్‌కేఐ క్షిపణులతో దాడి చేసినట్లు సమాచారం. బికనీర్‌లోని నాల్‌ సెక్టార్‌లోని సరిహద్దు వెంబడి చోటుచేసుకున్న ఈ ఘటనలో పాక్‌ యుద్ధ విమాన శకలాలు.. పాకిస్తాన్‌ సరిహద్దు వైపున ఉన్న ఇసుక దిబ్బలపై పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి : తీరు మారని పాక్‌.. సరికొత్త నాటకాలు!!)

ఇదిలా ఉండగా భారత్‌ మరోసారి మెరుపు దాడులకు పాల్పడిందంటూ పాకిస్తాన్‌ నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. జైషే ప్రధాన స్థావరం భవల్‌పూర్‌కు 100  కిలో మీటర్ల దూరంలోని అబ్బాస్‌ ఫోర్టుపై భారత వైమానిక దళం దాడి చేసిందంటూ కొన్ని వీడియోలు షేర్‌ చేశారు. ఆ తర్వాత పాక్‌ ఎదురుదాడికి దిగిందని పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. తాము సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొంది. ఇంధన ట్యాంకులను చేర్చే క్రమంలో పాకిస్తాన్‌ విమానం వల్లే అక్కడ పేలుడు సంభవించిందని తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాగా పుల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల నేపథ్యంలో పాక్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఆర్‌-73 అనే మిస్సైల్‌ ప్రయోగించి పాక్‌ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో అభినందన్‌ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగిన ఆయన.. జెనీవా ఒప్పందం మేరకు క్షేమంగా భారత్‌కు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు