నడిరోడ్డుపై తిష్ట.. రహదారిలో వెళ్లేదెట్ట..? 

4 Mar, 2019 19:27 IST|Sakshi
ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రోడ్డుపై నిలబడిన ఆవులు, ఎద్దులు   

బెంబేలెత్తుతున్న వాహనదారులు

రాత్రివేళల్లో పశువుల సంచారం 

రాకపోకలకు ఆటంకం  

సాక్షి, కడప: రాత్రి వేళ వాహనదారులు, చిరు వ్యాపారులు పనులు ముగించుకొని హడావుడిగా ఇళ్లకు వెళ్లే సమయంలో కడప నగర వాసులకు ప్రతి రోజు ఓ సమస్య వేధిస్తోంది. సరిగ్గా రోడ్డు మధ్యలో పశువులు తిష్టవేసి వచ్చి పోయే వాహనాలకు స్పీడు బ్రేకర్లుగా తయారవుతున్నాయి. వీటిని తప్పించుకు పోవాలంటే ప్రజలకు గగనమవుతోంది. నగర శివారు ప్రాంతంల్లోనో లేక ఏదైనా వీధిలో అయితే పర్వాలేదు. ఏకంగా ప్రధాన కూడళ్‌లైన ఆర్టీసీ బస్టాండు, ఏడురోడ్లు, అప్సర సర్కిల్, ఐటీఐ, చిన్నచౌక్‌లలో  రోడ్ల మధ్యలో గంటల తరబడి ఇవి నిలబడడం, పడుకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు.

రాత్రి పూట దగ్గరికి వచ్చినంత వరకు పశువులు పడుకున్నది అర్థం కాని పరిస్థితి. వాహనాలు రాత్రిపూట కొద్దిగా వేగంగా వెళుతున్న సమయంలో పశువులు గుంపులు గుంపులుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో వాహనాలు తిరగబడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులు రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతూ వాహనచోదకులతోపాటు చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తోపుడు బండ్లపై ఆకుకూరలు, కూరగాయలు, పలు రకాల పండ్లను తింటూ పాడు చేస్తున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
హెచ్చరికలు సరే.. చర్యలేవీ?
రోడ్డు మీదకు ఆవులు, గేదెలను వదిలితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసే కార్పొరేషన్‌ అధికారులు వాటిని అమలు చేయటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మీదకు వదిలిన పశువులను బందించి రోజుకు రూ.50 అపరాద రుసం వసూలు చేస్తామని, 15 రోజుల్లోపు బంధించిన పశువులను యజమానులు వచ్చి తోలుకెళ్లకపోతే వాటిని అడవులకు తరలిస్తామని గతంలో హెచ్చరికలు జారీ చేయటంతో కొద్దిరోజుల పాటు మాత్రమే వాటిని బయటకు రానీయకుండా యజమానులు జాగ్రత్త పడ్డారు.

ప్రస్తుతం కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో  మళ్లీ రోడ్లపైకి వచ్చి యథేచ్చగా తిరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకునే విధంగా కార్పొరేషన్‌ అధికారులు కట్టడి చేయాలని నగర ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు