మొబైల్ రీచార్జిలపైనా ఆదాయపన్ను నిఘా

26 Nov, 2016 15:22 IST|Sakshi
మొబైల్ రీచార్జిలపైనా ఆదాయపన్ను నిఘా
పాత కరెన్సీ నోట్లతో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అలా తమ వద్దకు వచ్చి పాత నోట్లతో ఎవరెవరు ఎంతెంతకు రీచార్జి చేయించుకున్నారో.. ఆయా నంబర్ల వివరాలన్నింటినీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించినట్లు తాజా సమాచారం. అంటే.. ఈ విషయంపై కూడా ఆదాయపన్ను శాఖ నిఘా మొదలవుతోందని అర్థం. డిసెంబర్ 15వ తేదీ వరకు పాత నోట్లతో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల రీచార్జి చేసుకోవచ్చు. అయితే అందుకు కేవలం 500 రూపాయల నోట్లను మాత్రమే ఉపయోగించాలని, ఆయా వినియోగదారుల మొబైల్ నంబర్లను కూడా టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాలని టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. 
 
పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న కథనాలు రావడంతో.. వీటి కోసం 500 నోట్లను డిసెంబర్ 15 వరకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. ఎవరెవరు వీటిని వినియోగించుకుంటున్నారో ఒక కన్నేసి ఉంచాలని భావిస్తోంది. దేశంలో 90 శాతం మంది ప్రీపెయిడ్ కనెక్షన్లనే ఉపయోగిస్తున్నట్లు ఓ అంచనా. 
మరిన్ని వార్తలు