అరుణాచల్‌కి వెళ్తే తప్పేముంది: నిర్మల

12 Nov, 2017 02:32 IST|Sakshi

గాంధీనగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని, ఈ విషయంలో ఇతరుల అభిప్రాయాలతో పనిలేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇటీవల ఆమె అక్కడ పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై ప్రశ్నించినపుడు..‘ఇందులో సమస్యేం ఉంది? అది మన భూభాగమే. మనం అక్కడికి వెళ్తాం. దీనిపై ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించాల్సిన పనిలేదు’ అని గాంధీనగర్‌లో బదులిచ్చారు.

టిబెటన్ల గురువు దలైలామాకు ఆశ్రయం కల్పించడం వల్లే భారత్‌–చైనా మధ్య వివాదాలు మొదలయ్యాయా అని అడిగిన మరో ప్రశ్నకు..ప్రతి సమస్యకు ఏదో ఒక కారణం ఉంటుందని, ఏ సంబంధమైనా ఏదో ఒక దాని వల్లే దెబ్బతినదని అన్నారు. గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు