ఐసీజే వేదికగా భారత్‌–పాక్‌ ఢీ

15 May, 2017 08:13 IST|Sakshi
ఐసీజే వేదికగా భారత్‌–పాక్‌ ఢీ

నేడు అంతర్జాతీయ న్యాయస్థానంలో జాధవ్‌ అంశంపై విచారణ
► 18 ఏళ్ల క్రితం ఐసీజేలో భారత్‌పై కేసు ఓడిన పాకిస్తాన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వేదికగా భారత్, పాకిస్తాన్‌లు నేడు మరోసారి తలపడుతున్నాయి. నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషన్‌ జాధవ్‌(46) కేసులో ఇరు దేశాలు వాదనల్ని వినిపించనున్నాయి. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెల్లో జాధవ్‌కు పాకిస్తాన్‌ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జాధవ్‌ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించిందని, జాధవ్‌ను కలిసేందుకు అనుమతించాలని 16 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని మే 8న భారత్‌ ఆశ్రయించింది.

చివరిసారిగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాకిస్తాన్‌లు 18 ఏళ్ల క్రితం తలబడ్డాయి. తమ నౌకా దళ విమానాన్ని భారత్‌ కూల్చివేసిందని, జోక్యం చేసుకోవాలంటూ ఐసీజేను పాకిస్తాన్‌ కోరింది. 1999, ఆగస్టు 10న భారత్‌ భూభాగంలోని కచ్‌ ప్రాంతం గగనతలంపైకి వచ్చిన పాకిస్తాన్‌ నేవీ విమానం అట్లాంటిక్యూను భారత ఎయిర్‌ఫోర్స్‌ విమానం కూల్చివేసింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

విమానం పాకిస్తాన్‌లో ఉండగానే కూల్చారని, పరిహారంగా భారత్‌ రూ. 390 కోట్లు(అప్పటి లెక్క ప్రకారం) చెల్లించాలం టూ పాకిస్తాన్‌ ఐసీజేను ఆశ్రయించింది. అయితే జూన్‌ 21, 2000న 16 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం పాకిస్తాన్‌ వాదనను 14–2 తేడాతో తోసిపుచ్చింది. ధర్మాసనానికి ఫ్రాన్స్‌కు చెందిన గిల్బర్ట్‌ గుయోమ్‌ అధ్యక్షతన వహించారు. ఈ తీర్పు అంతిమం కావడంతో పాకిస్తాన్‌కు అప్పీలుకు వీలులేకుండా పోయింది.

పాక్‌ వాదనల్ని తోసిపుచ్చిన ఐసీజే
మొత్తం నాలుగు రోజుల విచారణ ఏప్రిల్‌ 6, 2000న ముగియగా.. కేసు కోర్టు పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న అంశంపైనే వాదనలు కొనసాగాయి. ఈ అంశం కోర్టు పరిధిలోకి వస్తుందా? రాదా? అన్నది తేల్చేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. భారత్‌ తరఫున అప్పటి అటార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీ వాదనలు వినిపిస్తూ.. కేసు విచారణ పరిధిపై ప్రా«థమిక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాకిస్తాన్‌ పూర్తి బాధ్యత వహించాలని, పరిణామాలు కూడా అనుభవించాల్సిందేనని ఆయన వాదించారు. కేసులో త్వరగా తీర్పు వెలువరించాలంటూ పాకిస్తాన్‌ అటార్నీ జనరల్‌ ధర్మాసనాన్ని కోరారు. కేసును కశ్మీర్‌ అంశం, కార్గిల్‌ యుద్ధం, భారత్‌ పాక్‌ సంబంధాలకు ముడిపెడుతూ రాజకీయం చేసేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నించగా భారత్‌ అభ్యంతరం తెలిపింది.

>
మరిన్ని వార్తలు