శిశు మరణాలు తగ్గాయి

18 Sep, 2018 21:27 IST|Sakshi

పుట్టిన వెంటనే మరణిస్తోన్న ఆడపిల్లల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల

నాలుగురెట్లు తగ్గిన  ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు

ఆడపిల్లలను గుండెలమీద కుంపటిగా భావించే రోజులకు ఇక తావులేదు. ఆడపిల్ల పుట్టుకనే శాసించే భ్రూణ హత్యలూ, బాలికల శిశు మరణాలు ఇక ఎంతోకాలం సాగవు అనడానికి ఐక్యరాజ్యసమితి వెల్లడించిన తాజా గణాంకాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

గతంతో పోలిస్తే పుట్టగానే మరణిస్తున్న ఆడపిల్లల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో తగ్గిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే శిశుమరణాల విషయంలో సైతం మన దేశంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గత యేడాది 2017లో మన దేశంలో 8.02,000 శిశు మరణాలు సంభవించాయి. గత ఐదేళ్ళతో పోల్చుకుంటే ఇదే అతి తక్కువ అని యునైటెడ్‌  నేషన్స్‌ ఇంటర్‌ ఏజెన్సీ గ్రూప్‌ ఫర్‌ చైల్డ్‌ మోర్టాలిటీ ఎస్టిమేషన్‌(యుఎన్‌ఐజిఎంఇ)గుర్తించింది.

2017లో 6,05,000 మంది శిశువులు పుట్టిన వెంటనే మరణిస్తే 5నుంచి 14 ఏళ్ళలోపు వారు 1.52.000 మంది మరణించారు. చిన్నవయస్సులోనే మరణిస్తున్న శిశువుల సంఖ్య 2016లో 8.67 లక్షలు ఉంటే,  2017కి 8.02 లక్షలకి తగ్గింది.

2016లో ప్రతి 1000 మంది పిల్లల్లో పుట్టిన వెంటనే 44 మంది మరణించారు. 2017లో పుట్టిన ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 39 మంది ఐదేళ్ళలోపే మరణించారు. ఆడపిల్లలైతే పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 40 మంది చిన్నారులు ఐదేళ్ళలోపు మరణించారు. గత ఐదేళ్ళతో పోలిస్తే పుట్టిన వెంటనే మరణిస్తోన్న బాలబాలికల్లో లింగభేదం నాలుగు రెట్లు తగ్గింది.

యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం, ప్రపంచబ్యాంకు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికను బట్టి ప్రపంచవ్యాప్తంగా 2017లో 63 లక్షల మంది 15 యేళ్ళలోపే మృత్యువాత పడ్డారు. దీన్ని బట్టి ప్రతి ఐదు సెకండ్లకూ నివారించదగిన కారణాలతో ఒక చిన్నారి మరణిస్తూనే ఉన్నపరిస్థితి. ఇందులో అత్యధికంగా 54 లక్షల మంది చిన్నారులు పుట్టిన తొలి ఐదేళ్ళలోపున మరణించారు.

  • 2017లో అంతర్జాతీయంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారులు సహారాఎడారి దిగువన ఉన్న ఆఫ్రికాలోనే 50 శాతం మంది ఉన్నారు. ప్రపంచంలో మరణిస్తున్న చిన్నారుల్లో 30 శాతం మంది దక్షిణాసియాకి చెందినవారే.
  • యూరప్‌ కంటే సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికా దేశంలో 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు 15 రెట్లు ఎక్కువ.
  • శిశువుకి అత్యంత కీలక దశ అయిన పుట్టిన నెలలోపే ప్రపంచవ్యాప్తంగా 2017లో 25 లక్షల మంది శిశువులు మరణించారు.
  • పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ళలోపు చిన్నారుల మరణాలు 50 శాతం అధికం.
  • 1990లో 1.2.6 కోట్ల మంది ఐదేళ్ళ లోపు చిన్నారుల మరణిస్తే, 2017లో 54 లక్షల మంది ఐదేళ్ళలోపు చిన్నారులు మరణించారు.
  • ఐదు నుంచి 14 ఏళ్ళలోపు చిన్నారుల మరణాలు సైతం 17 లక్షల నుంచి పది లక్షల లోపుకి తగ్గడం పురోభివృద్ధిగా భావిస్తున్నారు.

సాధారణ ఔషధాలూ, టీకాలూ, సురక్షిత నీరు, విద్యుత్‌ లాంటి చిన్న చిన్న సహకారం అందకనే చాలా మంది మరణిస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడం, దీనితో పాటు దేశ వ్యాప్తంగా పుట్టినవెంటనే పిల్లల సంరక్షణకోసం ప్రత్యేక యూనిట్లు ప్రారంభించడం చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించినట్టు యూనిసెఫ్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్‌ క్యాంపెయిన్‌లో భాగంగా అందిస్తోన్న పౌష్టికాహారం, 2019కల్లా బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నివారించే లక్ష్యంతో జరుగుతోన్న ప్రయత్నం కూడా చిన్నారులను మృత్యువుదరికి చేరకుండా ఆపుతోందని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు