భారత్ను సింహంగా తయారు చేస్తాం: పారికర్

23 Mar, 2015 08:39 IST|Sakshi
భారత్ను సింహంగా తయారు చేస్తాం: పారికర్

భువనేశ్వర్: భారతదేశాన్ని సింహంలాగా తయారుచేస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. 'మేకనైతే బలిపీఠం ఎక్కించేందుకు ఎవరైనా సిద్ధమవుతారు.. కానీ సింహం విషయంలో ఆ సాహసం చేస్తారా.. అందుకే సింహమంతటి శక్తిమంతగా భారత్ను తయారు చేస్తాం' అని ఆయన చెప్పారు.భారతదేశం త్వరలోనే యుద్ధ సమాగ్రిని ఎగుమతి చేయనుందని వివరించారు. మొత్తం 38 దేశాలకు యుద్ధ సామాగ్రితోపాటు ఆయా దేశాల్లో యుద్ధ మెళకువలు నేర్చుకునేందుకు భారత సైనికాధికారులను పంపిస్తామని చెప్పారు.

ఏ ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోబోమని, ప్రతి దేశంతో స్నేహపూర్వక సంబంధాలతో ముందుకు వెళుతూ దేశాన్ని పటిష్ఠంగా రూపుదిద్దుతామని చెప్పారు. విదేశాలతో మంచి సంబంధాల్లో భాగంగానే వారి దేశాల్లోని సైనికులకు భారత్లో శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించామని, వారు త్వరలోనే రానున్నారని చెప్పారు. అయితే, ఏ దేశాల సైనికులు భారత్లో శిక్షణకు వస్తున్నారన్న విషయం మాత్రం భద్రతా దృష్ఠ్యా చెప్పలేదు.  త్వరలోనే విశాఖపట్నం తీరంలో నావికా దళ విన్యాసాలు నిర్వహిస్తున్నామని, ఇందులో వివిధ దేశాలు కూడా పాల్గొంటున్నాయని చెప్పారు. చైనా వస్తుందా అన్న ప్రశ్నకు తాము ఇంకా ఆహ్వానం పంపించాల్సి ఉందని తెలిపారు. జాబితా పూర్తవగానే మీడియాకు విడుదల చేస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు