అమెరికాకు అదిరిపోయే కౌంటరిచ్చిన ఉత్తర కొరియా

2 Dec, 2023 15:15 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్‌:  అగ్ర రాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అంతరిక్ష హక్కులు, తాము ప్రయోగించిన నిఘా ఉపగ్రహానికి అమెరికా హాని తలపెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా మండిపడినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. 

ఈ క్రమంలో నార్త్‌ కొరియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఒకవేళ అమెరికా అటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని తాము యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని తెలిపారు. తమ​ చట్టబద్ధమైన అంతరిక్ష ఉపగ్రహా కార్యక్రమాలకు సంబంధించిన విధానాలను ఉల్లంఘించడానికి ప్రయత్నస్తే.. తాము కూడా అమెరికా గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేయటం, ప్రతిఘటించడానికి తమదైన వ్యూహాలను పరిశీలిస్తున్నామన్నారు. 

అదేవిధంగా స్వీయ రక్షణలో భాగంగా అమెరికా స్పేస్ కమాండ్ ప్రతినిధి షెరిల్ క్లింకెల్ మాట్లాడుతూ.. అన్ని డొమైన్లలోని తమ ప్రత్యర్థి దేశాల శక్తి, సామర్థ్యాలను తాము ఎందుర్కొవటంతో పాటు, అవసరమైతే వాటిని నాశనం చేసే సత్తా తమకు ఉందని వ్యాఖ్యానించారు. 

ఉత్తర కోరియా బాలిస్టిక్‌ టెక్నాలజీ ఉపయోగించి చేపట్టే పలు క్షిపణీ పరీక్షల విషయంలో యూఎన్‌ తీర్మాణాల పాటించని విషయం తెలిసిందే. అయితే అంతరిక్ష ప్రయోగాల సామర్థ్యాలకు బాలిస్టిక్‌ క్షిపణలు అభివృద్ధికి మధ్య సాంకేతికత విషయంలో దగ్గరి సంబంధాలు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు