72 గంటల్లోనే గల్వాన్‌‌ నదిపై బ్రిడ్జి నిర్మాణం

20 Jun, 2020 15:05 IST|Sakshi
గల్వాన్‌ బ్రిడ్జి (కర్టెసీ: ప్లానెట్‌ ల్యాబ్స్‌ వయా ఇండియా టుడే)

గల్వాన్ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన భారత ఆర్మీ!

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్న భారత్‌.. ఒకవేళ చైనా గనుక తోక జాడిస్తే సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమవుతోంది. తాజా ఘర్షణలకు మూల కారణంగా చైనా ఆరోపిస్తున్న రోడ్డు, వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా పదాతిదళాలు, సైనిక, యుద్ధ వాహనాల రాకపోకలకై గల్వాన్‌ నదిపై తలపెట్టిన పోర్టబుల్‌ బ్రిడ్జి(బెయిలీ బ్రిడ్జి- ) నిర్మాణాన్ని భారత ఆర్మీ ఇంజనీర్లు గురువారం మధ్యాహ్నం పూర్తిచేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి జిత్తులమారి డ్రాగన్‌ దొంగ దెబ్బ కొడుతుంటే ఓ వైపు వారికి సమాధానం చెబుతూనే.. మరోవైపు భారత ఆర్మీ అధికారులు వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. 

ఈ క్రమంలో చైనా కుయుక్తులకు 20 మంది సైనికులు అమరులైనప్పటికీ పోరాట పటిమతో ముందుకు సాగుతూ.. మంగళవారం ఉదయం నుంచే నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఉద్రిక్తతల నడుమ వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలో 72 గంటల్లో 60 మీటర్ల పొడవైన బెయిలి బ్రిడ్జిని నిర్మించారు. భారత ఆర్మీలోని కరూ- బేస్ట్‌ డివిజన్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజనీర్లు జాప్యానికి తావివ్వకుండా.. అత్యంత ప్రతికూల పరిస్థితులు, గడ్డకట్టే చలిలో సైనికుల పహారా నడుమ చకచకా ఈ పనిని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. (బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు!)

త్వరలోనే రోడ్డు నిర్మాణం కూడా..
సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన పెట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద జూన్‌ 16న భారత ఆర్మీ డివిజనల్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ అభిజిత్‌ బాపట్‌ చైనా కమాండర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఓ వైపు సామరస్యపూర్వకంగా చర్చలు జరుగుతున్నా.. చైనా కుయుక్తులను దృష్టిలో పెట్టుకుని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ చేపట్టిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని సైనికులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అదే విధంగా గల్వాన్, ష్కోక్ నదుల సంగమ ప్రదేశంలోని ఈస్ట్‌బ్యాంక్‌లో చేపట్టిన డీఎస్‌డీబీఓ రోడ్డు నిర్మాణాన్ని కూడా త్వరలోనే పూర్తిచేసేందుకు భారత్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా గాల్వన్‌ నదిపై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే గాల్వన్‌ లోయతో పాటు నార్త్‌ సెక్టార్లకు సైన్యం సులభంగా రాకపోకలు సాగించవచ్చు. (జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..)

ఇక నిర్మాణాల నేపథ్యంలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న చైనా..  గల్వాన్‌ లోయపై పట్టు సాధించేందుకు వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. అంతేగాక భారత భూభాగంలోని గాల్వన్‌ నదిపై డ్యామ్‌ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎర్త్‌- ఇమేజింగ్‌ కంపెనీ ప్లానెట్‌ ల్యాబ్స్‌ ఇటీవల విడుదల చేసింది. కాగా తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు సూచించగా.. చైనా ఆర్మీ దాడికి తెగబడిన విషయం తెలిసిందే. రాళ్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి దొంగదెబ్బ కొట్టారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. చైనా ఇంతవరకు తమ సైనిక మరణాల సంఖ్యను అధికారికంగా వెల్లడించడం లేదు. అంతేగాక గాల్వన్‌ నదిపై నిర్మిస్తున్న కట్టడంపై మౌనం వహిస్తోంది.

మరిన్ని వార్తలు