'గే'లకు మరణశిక్ష విధించాలి!

16 Jun, 2016 14:58 IST|Sakshi
'గే'లకు మరణశిక్ష విధించాలి!

దేశంలో గే సంస్కృతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని, అందుకు ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్, కీర్) కమ్యూనిటీకి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మదురైలో వెలసిన పోస్టర్లు ఆ కమ్యూనిటీకి చెందినవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఆర్లాండ్లోని ఓ నైట్ క్లబ్‌లో ఓ ఉన్మాది 49 మందిని ఊచకోత కోసిన మర్నాడే ఈ పోస్టర్లు వెలిశాయి. అసహజ శృంగారాన్ని ఆచరించేవారు, ప్రోత్సహించేవారు 'సాంస్కృతిక టెర్రరిస్టులు' అని, వారికి మరణ శిక్ష విధించేందుకు వీలుగా ఇండియన్ పీనల్ కోడ్‌లోని 377వ సెక్షన్ సవరించాలని ఇండియన్ నేషనల్ లీగ్ అనే ముస్లిం పార్టీ డిమాండ్ చేసింది.

ఐపీసీలోని 377వ సెక్షన్ బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉంది. ఈ చట్టాన్ని 1860లో తీసుకొచ్చారు. ఈ చట్ట ప్రకారం మగ, ఆడ లేదా జంతువులతో ఎవరైనా అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడితే వారికి పదేళ్లవరకు జైలుశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించవచ్చు, జరిమానా కూడా విధించవచ్చు. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దుచేయాలని భారతదేశంలోని గే ఉద్యమకారులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం ఎవరిపైనా ప్రయోగించకపోయినా చట్టం కారణంగా తమపట్ల ప్రజల్లో విద్వేష భావం పెరుగుతున్నదన్నది వారి వాదన.

ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా గే లకు మరణశిక్ష విధించాలనే డిమాండ్ తీసుకురావడం వారిలో భయాందోళనలను రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ అమెరికా కాలేజీ గోడలపై కనిపించిన ఈ పోస్టర్లను తక్షణమే తొలగించి, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని గోపీ శంకర్ అనే ఓ గే ఉద్యమకారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి పోస్టర్లపై చర్య తీసుకునేందుకు చట్టం అనుమతించదని పోలీసులు చెబుతున్నారు. గేలకు వ్యతిరేకంగా తామేమీ కొత్తగా ఈ డిమాండ్‌ను తీసుకరాలేదని, ఇది ముందునుంచి ఉన్నదేనని, పైగా తాము వేసిన పోస్టర్ 2013లో ముద్రించిందని ఇండియన్ నేషనల్ లీగ్ స్పష్టం చేసింది. గేలు గుమిగూడేచోట గే సంస్కృతికి వ్యతిరేకంగా ఐఎన్ఎల్ కరపత్రాలను పంచుతోందని, ఈ చర్య వల్ల విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందని శంకర్ అంటున్నారు.

మరిన్ని వార్తలు