దక్షిణ చైనా సముద్రంలో భారతీయ మిస్సైల్‌

18 Aug, 2017 17:31 IST|Sakshi



న్యూఢిల్లీ:
దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అంటున్న చైనాకు భారత్‌ షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై భారతీయ క్షిపణులు చైనాకు సవాలుగా మారనున్నాయి. వాస్తవానికి దక్షిణ చైనా సముద్రంపై బ్రూనై, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్‌, వియత్నాంలకు కూడా అధికారాలు ఉన్నాయి. అయితే చైనా మిగిలిన దేశాలను బెదిరిస్తూ సముద్రం మొత్తం తమ కిందకే వస్తుందని వాదిస్తోంది.

దక్షిణ చైనా సముద్ర తీరం కలిగిన వియత్నాంతో భారత్‌కు ఎప్పటినుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా వియత్నాంకు ఓడలపై నుంచి ప్రయోగించే అత్యధిక శక్తిమంతమైన మిస్సైల్‌ బ్రహ్మోస్‌ను అందించింది. కొన్నేళ్లుగా భారత్‌-వియత్నాంల మధ్య ఈ మిస్సైల్‌ అమ్మకానికి చర్చలు జరుగుతూ వచ్చాయి. చైనా భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతుండటంతో ప్రభుత్వం ఈ మిస్సైల్స్‌ను వియత్నాంకు ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత నేవీ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన మిస్సైల్‌ బ్రహ్మోసే. ధ్వని వేగం కంటే రెండున్నర రెట్లు అధిక వేగంతో ప్రయాణించగల సామర్ధ్యం దీని సొంత. దీన్ని ఓడల నుంచి సులువుగా ప్రయోగించొచ్చు. ప్రపంచ దేశాల వద్ద ఉన్న ఈ తరహా మిస్సైల్స్‌లో బ్రహ్మోసే అత్యాధునికం. భారత్‌ నుంచి తొలి విడతగా అందాల్సిన బ్రహ్మోస్‌ మిస్సైల్స్ తమ వద్దకు చేరుకున్నట్లు వియత్నాం అధికారి ఒకరు తెలిపారు.  అయితే, బ్రహ్మోస్‌ క్షిపణుల అమ్మకంపై భారత్‌ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

మరిన్ని వార్తలు