70 ఏళ్లకు కనిపించిన సర్పం

11 May, 2019 04:37 IST|Sakshi

అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రత్యక్షమైన ‘పిట్‌ వైపర్‌’ పాము

ఇంతకుముందు కనిపించినవి నాలుగు రకాల పాములే

ఈటానగర్‌: అదో అత్యంత అరుదైన విషసర్పం. ఎప్పుడో సుమారు 70 ఏళ్ల క్రితం అంటే దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తున్న సమయంలో దేశంలో కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకి అలాంటి అరుదైన జాతి సర్పాన్ని అరుణాచల్‌ప్రదేశ్‌ అడవుల్లో పరిశోధకులు గుర్తించారు. స్వాతంత్య్రం సమయంలో కనిపించినవి 4 పాములు కాగా.. తాజాగా గుర్తింపుతో వీటి సంఖ్య ఐదుకి చేరింది. ఇంతకీ అంతటి అరుదైన పాము ఏంటా అనుకుంటున్నారా..? దాని పేరే పిట్‌ వైపర్‌. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా ఈగల్‌నెస్ట్‌లోని అడవుల్లో సరీసృపాలపై నిర్వహించిన పరిశోధనల్లో ఓ పామును కనుగొన్నారు. చెట్ల మధ్యన దాక్కుని.. చెట్ల ఆకుల్లో కలిసిపోయేలా ఉన్న దీని డీఎన్‌ఏపై పరిశోధనలు జరిపి.. పిట్‌ వైపర్‌ జాతికి చెందినదిగా గుర్తించారు. అయితే ఇది కొత్త రకం పిట్‌ వైపర్‌ అని కనుగొన్నారు. ఈ పాముకు అరుణాచల్‌ ప్రదేశ్‌ పేరు మీదుగా ‘అరుణాచల్‌ పిట్‌ వైపర్‌’(ట్రైమెరెసురస్‌ అరుణాచలెనిస్‌) అని నామకరణం చేశారు. ఇలా ఓ సర్పానికి రాష్ట్రంపేరు కలుపుతూ పేరు పెట్టడం దేశంలో ఇదే తొలిసారి.

మరో కొత్త రకం..
ప్రస్తుతం కనుగొన్న సర్పం పిట్‌ వైపర్‌ జాతికే చెందినప్పటికీ.. ఈ జాతిలో ఇది కొత్త రకం అని వారు చెబుతున్నారు. ఇది ముదురు ఎరుపు, గోధుమ రంగుల కలయికతో స్థానిక చెట్ల రంగులతో కలిసిపోయిందని తెలిపారు. ఈ సర్పాలకు తల భాగంలో రెండు వైపులా పిట్స్‌ (చిన్న రంధ్రాలు) ఉంటాయి. ఈ పాములకు మాత్రమే ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అందుకే వీటికి పిట్‌ వైపర్‌ అంటారు. తమ ఎదుట ఉన్న జీవుల శరీరంలోని వేడి ద్వారా అది ఏ తరహా జీవో అంచనా వేయడంతోపాటు వాటి ఆధారంగా వేట సాగించడం వీటి ప్రత్యేకత.  

సంతానోత్పత్తిపై ప్రయోగాలు..
‘అరుణాచల్‌ పిట్‌ వైపర్‌కు సంబంధించి ప్రస్తుతం మాకు ఏమీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మాకు దొరికింది ఒక మగజాతి పిట్‌ వైపర్‌ మాత్రమే. మరిన్ని పరిశోధనలు జరపడం ద్వారా దీని సహజ లక్షణాలను తెలుసుకోగలం. ఇవి ఏం ఆహారం తీసుకుంటాయి.. రోజువారీ అలవాట్లు, సంతానోత్పత్తి క్రమంలో గుడ్లు పెడతాయా? లేక నేరుగా పిల్లలకు జన్మనిస్తాయా? అనే విషయంపై పరిశోధనలు సాగించాలి’అని ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన హెర్పటాలజిస్ట్‌ అశోక్‌ కెప్టెన్‌ తెలిపారు.

మిగతా నాలుగు ఇవే..
మలబార్‌ పిట్‌ వైపర్, హార్స్‌షూ పిట్‌ వైపర్, హంప్‌ నోస్‌డ్‌ పిట్‌ వైపర్, హిమాలయన్‌ పిట్‌ వైపర్లను సుమారు 70 ఏళ్ల కింద దేశంలో కనుగొన్నట్లు అశోక్‌ చెప్పారు. ఈ బృందంలో వి.దీపక్, రోహన్‌ పండిట్, భరత్‌ భట్, రమణ ఆత్రేయ సభ్యులుగా ఉన్నారు. ఈ పరిశోధన వివరాలు రష్యన్‌ జర్నల్‌ ఆఫ్‌ హెర్పటాలజీ, మార్చి–ఏప్రిల్‌ సంచికలో ప్రచురితమయ్యాయి.  

మరిన్ని వార్తలు