జీపీఎస్ కు బదులుగా ఇస్రో సొంత సిగ్నల్ వ్యవస్థ

7 Dec, 2015 19:35 IST|Sakshi
జీపీఎస్ కు బదులుగా ఇస్రో సొంత సిగ్నల్ వ్యవస్థ

జీపీఎస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ మారుమూల ప్రాంతాన్ని చేరాలన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. మొబైల్‌ అందుబాటులో ఉంటే చాలు... వెళ్లాల్సిన ప్రాంతాన్ని యాప్ లో ఎంటర్‌ చేశారంటే... మ్యాపింగ్‌ ద్వారా మీరు చేరాల్సిన గమ్యాన్ని అదే చూపిస్తుంది. ఏ మలుపు ఎక్కడ తిరగాలో కూడా చెప్తుంది. అమెరికాకు చెందిన ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌లో  ఉపగ్రహాలు మొత్తం భూమిని కవర్ చేస్తూ శాటిలైట్ ద్వారా అందించే సమాచారాన్ని మనకు అందుబాటులోకి తెస్తాయి. అయితే ఇప్పుడు..  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జీపీఎస్ కు బదులుగా ఇండిజినస్ పొజిషన్ డిటర్మినేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థను స్థాపించనుంది.

ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ ను ఉపయోగించి... జీపీఎస్‌ను భర్తీ చేసేలా ఈ కొత్త విధానం వచ్చే ఏడాది మధ్యనాటికి అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రారంభమౌతుందని,  ఇస్రో ప్రచురణ ప్రజా సంబంధాల డైరెక్టర్ దేవీప్రసాద్ కార్నిక్ చెప్తున్నారు. పూర్తిగా భారత ప్రభుత్వం నియంత్రణలో పనిచేసే ఈ కొత్త  ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (IRNSS) దేశంలోని యూజర్లకు సరైన సమాచారాన్ని, స్థానాన్ని అందించేందుకు ఇస్రో అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తే... సిగ్నల్స్ మరింత మెరుగ్గానూ, కచ్చితంగానూ ఉంటాయని ఇస్రో అధికారులు భావిస్తున్నారు. విదేశీ ప్రభుత్వ నియంత్రణలో ఉండే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్... అన్ని పరిస్థితుల్లోనూ మనకు సేవలు అందిస్తుందన్న హామీ లేకపోవడంతో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అవసరమౌతుందని భావిస్తున్నారు. రెండు విధాలుగా సేవలు అందించే ఐఆర్ఎన్ఎస్ఎస్ లో మొదటిది స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ (SPS). ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్ (RS). మిలట్రీ సహా కొంతమంది ప్రముఖ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త విధానం విపత్తు నిర్వహణ, వాహన ట్రాకింగ్, నౌకా నిర్వహణ సహా మొబైల్ ఫోన్లతో అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులకు కావలసిన లింకులు, వాహనాలు నడిపేవారికి విజువల్, వాయిస్ నేవిగేషన్లతో పాటు మరిన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది. మొత్తం ఏడు ఉపగ్రహాలతో పనిచేసే ఈ సిస్టమ్ లో ప్రస్తుతం నాలుగు  ఉపగ్రహాలు కక్ష్యలో ఉండగా మిగిలిన మూడింటిని వచ్చే ఏడు జనవరి, మార్చి మధ్య స్థాపించేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం జీపీఎస్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం, మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనంగా ఉండటంతో తాము సొంత సిగ్నల్‌తో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు ఇస్రో అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు