జయలలిత ఆడియో క్లిప్పుల విడుదల

27 May, 2018 03:27 IST|Sakshi

రక్తపోటు, శ్వాసకోశ సమస్యలపై వైద్యులతో చర్చ  

సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన ఆడియో క్లిప్పులు వెలుగులోకి వచ్చాయి. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ వీటిని శనివారం విడుదల చేసింది. దాదాపు 1.07 నిమిషాల నిడివి ఉన్న తొలి ఆడియో క్లిప్‌లో ‘మీకు రక్తపోటు(బీపీ) ఎక్కువగా ఉంది. సిస్టోలిక్‌ పీడనం 140గా ఉంది’ అని జయకు డ్యూటీ డాక్టర్‌ చెప్పారు. ఆమె వెంటనే ‘డయాస్టోలిక్‌ పీడనం ఎంతుంది?’ అని అడిగారు. దీనికి 140/80 అని  డాక్టర్‌ జవాబిచ్చారు.

దీంతో ‘అయితే అది నాకు మామూలే’ అని జయలలిత సంతృప్తి వ్యక్తం చేశారు. శ్వాస తీసుకోవడంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందిని కేఎస్‌ శివకుమార్‌ అనే వైద్యుడికి వివరిస్తూ.. ‘శ్వాస తీసుకున్నప్పడు వస్తున్న గురకలాంటి శబ్దం నాకు స్పష్టంగా విన్పిస్తోంది. అది సినిమా థియేటర్‌లో అభిమానులు వేసే విజిల్స్‌లా ఉంది’ అని జయలలిత చమత్కరించారు. కమిషన్‌ విడుదల చేసిన మరో 33 సెకన్ల ఆడియో క్లిప్‌లో డా.శివకుమార్‌ జయతో మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు వస్తున్న శబ్దం తీవ్రత తగ్గిందని జయలలితకు చెప్పారు.

దీంతో ఆమె వెంటనే స్పందిస్తూ.. ‘గురకలాంటి శబ్దం ఎక్కువగా ఉండగానే రికార్డు చేసేందుకు మొబైల్‌లో అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేయమని మీకు చెప్పాను. మీరేమో కుదరదన్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో కుమార్‌ ‘మీరు చెప్పిన వెంటనే మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేశాను’ అని సమాధానమిచ్చారు. అలాగే ఆస్పత్రిలో భోజనానికి సంబంధించి జయలలిత రాసుకున్న లిస్ట్‌ను కమిషన్‌ బహిర్గతం చేసింది. కాగా, తూత్తుకుడి కాల్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ఆడియో క్లిప్పులను విడుదల చేయించిందని ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ఆరోపించారు.

2016, సెప్టెంబర్‌ 22న అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల చికిత్స అనంతరం డిసెంబర్‌ 5న చనిపోయారు. చికిత్స సమయంలో జయను ఎవ్వరికీ చూపకపోవడంతో  ఆమె మరణంపై అనుమానాలు తలెత్తాయి. వీటిని నివృత్తి చేసేందుకు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ విచారణలో భాగంగా జయకు చికిత్స అందించిన వైద్యులు, అపోలో ఆస్పత్రి చీఫ్‌ ప్రతాప్‌.సి. రెడ్డి, జయ నెచ్చెలి శశికళ సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు.

మరిన్ని వార్తలు