బాంబు పేల్చిన శశికళ

10 Oct, 2016 12:28 IST|Sakshi
బాంబు పేల్చిన శశికళ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప పెద్ద బాంబు పేల్చారు. ''ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్న కొంతమంది వ్యక్తులు'' అంటూ జయలలిత సన్నిహితురాలు శశికళను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. సుమారు గత 18 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసి, అన్నాడీఎంకే పార్టీకి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీని నియమించాలనుకుంటున్నారని ఆమె తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు కూడా వాళ్లు కుట్ర పన్నుతున్నారన్నారు. అందువల్ల జయలలిత నుంచి అధికారికంగా ఏదైనా లేఖ వస్తే మాత్రం అందులో ఆమె సంతకాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేయాలని గవర్నర్‌ను ఆమె కోరారు. ఈ విషయంలో గానీ, మరేదైనా విషయంలో గానీ జయలలిత నుంచి ఎలాంటి లేఖలు వచ్చినా సంతకాలు జాగ్రత్తగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఏ ఒక్కరినీ ఆమెను చూసేందుకు అనుమతించలేదు. కేవలం వైద్యులతో మాత్రమే మాట్లాడనిచ్చారు. చివరకు జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్, మేనకోడలు దీప కూడా జయలలిత వద్దకు వెళ్లలేకపోయారు. కానీ, జయ సన్నిహితురాలు శశికళ మాత్రం.. ఇన్నాళ్లుగా ఐసీయూలోనే ఆమె పక్కనే ఉంటున్నారు. దీనిపైనే రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు