కన్హయ్యను బహిష్కరించాలి

15 Mar, 2016 00:48 IST|Sakshi
కన్హయ్యను బహిష్కరించాలి

మరో ఐదుగురిని కూడా; జేఎన్‌యూ ఘటనపై విచారణ కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో గత నెలలో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో పోషించిన పాత్రకు గాను.. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకుమార్, ఉమర్‌ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు సహా ఐదుగురిని బహిష్కరించాలని (రస్టికేషన్) వర్సిటీ ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయితే.. సిఫారసులను క్షుణ్ణంగా పరిశీలించాక వీసీ ఎం.జగదీశ్‌కుమార్, చీఫ్ ప్రొక్టార్ ఎ.దిమ్రీలు నిర్ణయం తీసుకుంటారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. అఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

నాటి ఘటనపై ఏర్పాటైన విచారణ కమిటీ.. 21 మంది విద్యార్థులు వర్సిటీ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించారని నివేదికలో పేర్కొంది. నివేదికపై సోమవారం చర్చించిన పాలకవర్గం ఆ 21 మందికి షోకాజ్ నోటీసులు జారీచేసి, జవాబిచ్చేందుకు ఈ నెల 16 వరకు గడువు ఇచ్చింది.

నేడు పార్లమెంటుకు ర్యాలీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, ఎస్‌ఏఆర్ గిలానీల విడుదల కోరుతూ జేఎన్‌యూ విద్యార్థులు మంగళవారం పార్లమెంటు దాకా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏది జాతీయవాదమో, ఏది జాతి వ్యతిరేకమో తేల్చేందుకు దీనిపై జాతీయ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని జేఎన్‌యూ అధ్యాపక సంఘం డిమాండ్ చేసింది. దళితులు, ముస్లిం అధ్యాపకులు దేశ వ్యతిరేకులంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్న సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్ విభాగం అధిపతి అమితాసింగ్‌ను జేఎన్‌యూ పాలకవర్గం వివరణ కోరింది.  
 
రోహిత్‌కు ఇరోమ్ షర్మిల స్కాలర్‌షిప్: హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ వేముల (మరణానంతరం)కు, జేఎన్‌యూ ఎస్‌యూకు సంయుక్తంగా ఇరోమ్ షర్మిల-2016 స్కాలర్‌షిప్‌ను ప్రకటించారు. స్కాలర్‌షిప్ చెక్కులను వీరి తరఫున కన్హయ్య అందుకున్నారు. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ నందిని సుందర్ 2012 నుంచి ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నారు. దీనికింద రూ.50 వేలు (ఉమ్మడిగా ఉంటే రూ.60వేలు) ఇస్తారు.

>
మరిన్ని వార్తలు