డుమ్మా మాస్టర్‌పై దండెత్తారు | Sakshi
Sakshi News home page

డుమ్మా మాస్టర్‌పై దండెత్తారు

Published Tue, Mar 15 2016 12:45 AM

డుమ్మా మాస్టర్‌పై దండెత్తారు

నాలుగేళ్ల తరువాత బడికి వచ్చి..
ఆపై జనం వ్యతిరేకతకు గురై వెనుదిరిగిన వైనం..

 
 ములుగు: ఒకటీ రెండూ కాదు.. ఏకంగా నాలుగేళ్లు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు డుమ్మా కొట్టాడు. అధికారులు, ఎవరూ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. తీరా తీరిగ్గా సోమవారం విధుల్లో చేరడానికి వచ్చాడు. గ్రామస్తులంతా ఏకమై అతనిని తిప్పి పంపారు. మెదక్ జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ సక్సెస్ స్కూల్‌లో 253 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. తెలుగు పండిట్‌కే రాంచంద్రం 2012, జూన్ 13 తరువాత నుంచి ఎవరి అనుమతి లేకుండానే విధులకు గైర్హాజరయ్యారు. వరుసగా, 2013-14, 2014-15 విద్యా సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయుడు లేకుండానే ఈ సక్సెస్ స్కూల్ కొనసాగింది. గ్రామస్తులంతా విన్నవించడంతో ఇటీవలే సింగన్నగూడ తెలుగు పండిట్‌ను డిప్యుటేషన్‌పై విద్యాశాఖ ఇక్కడికి పంపింది. తాజా విద్యా సంవత్సరం (2015-16)లో డిప్యుటేషన్ రద్దు కాగా విద్యార్థుల పరిస్థితి షరా మామూలే అయింది. విషయాన్ని గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్, డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు.

 ఖాళీ చూపించక.. మరొకరిని నియమించక
 ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు బదిలీ అయితే దానిని ఖాళీగా చూపుతారు. దీర్ఘకాలం సెలవుపై వెళ్తే విద్యాప్రమాణాలు దెబ్బతినకుండా వలంటీర్‌ను నియమిస్తారు. ఎవరైనా ఉపాధ్యాయుడు వారం మించి అనధికారికంగా గైర్హాజరైతే విద్యాశాఖ క్రమశిక్షణ తీసుకుంటుంది. కానీ క్షీరసాగర్ హైస్కూల్‌లో మాత్రం నాలుగేళ్లుగా ఓ టీచర్ అనధికారికంగా గైర్హాజరైనా జిల్లా విద్యాశాఖకు పట్టింపు లేకపోయింది. కనీసం ఇక్కడ పోస్టును ఖాళీగా చూపలేదు. దీంతో గత ఆగష్టులో జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో ఇక్కడి తెలుగు పండిట్ పోస్టు భర్తీ కాలేదు.  

 ఉపాధ్యాయుని తిప్పి పంపిన గ్రామస్తులు
 డుమ్మాల మాస్టర్ మాకొద్దంటూ సోమవారం గ్రామ సర్పంచ్ వెంకటేష్‌గౌడ్, ఎంపీటీసీ తారక సురేష్, అన్నసాగర్ ఉపసర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి గ్రామస్తులతో కలసి వచ్చి పాఠశాల హెచ్‌ఎం నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్ల తరువాత బడికి ఎందుకు వచ్చావని నిలదీశారు. కాగా జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల లేఖతో విధుల్లో చేరేందుకు వచ్చిన ఉపాధ్యాయుడు రాంచంద్రం దీంతో విధుల్లో చేరకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాడు.  
 
 ఉపాధ్యాయునిపై చర్యలు
 నజీమొద్దిన్, జిల్లా విద్యాశాఖ అధికారి

 నాలుగేళ్లుగా విధులకు గైర్హాజరైన క్షీరసాగర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు కే రాంచంద్రంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అతనికి నోటీసులిచ్చాం. అతను క్షీరసాగర్ పాఠశాలలోనే తిరిగి విధుల్లో చేరాలని ఫిబ్రవరి 22న ఆదేశాలిచ్చిన మాట వాస్తవం. అక్కడ విధుల్లో చేరాక చర్యలకు ఉపక్రమిస్తాం. విధుల్లో చేరకుంటే డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు చర్యల కోసం నివేదిస్తాం.

Advertisement
Advertisement