మంత్రి ఖాతాలో మరో వికెట్! | Sakshi
Sakshi News home page

మంత్రి ఖాతాలో మరో వికెట్!

Published Tue, Mar 15 2016 7:40 AM

మంత్రి ఖాతాలో మరో వికెట్! - Sakshi

 దీర్ఘకాలిక సెలవుపై డీఆర్‌వో
  కలెక్టర్‌పై మంత్రి ఒత్తిళ్లతోనే...
  జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశం
  దుర్గగుడి మాజీ ఈవో
   నరసింగరావును  తెచ్చేందుకే?

 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా మంత్రి అచ్చెన్నాయుడి చేతిలో మరో ప్రభుత్వ ఉద్యోగి బలయ్యారు. తాను చెప్పినట్టు వినకపోతే సరెండర్, లాంగ్‌లీవ్, బదిలీ, సస్పెన్షన్లు తప్పవంటూ మంత్రి పదేపదే సెలవిచ్చేవారు. ఈ తరహాలో గతంలో కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇందులో మహిళలూ ఉన్నారు. డీఈవో, ఆర్వీయం పీవో, మెప్మా పీడీ, పోలాకీ ఎంపీడీవో ఇలా పలువురు మంత్రి బారిన పడ్డారు. తాజాగా డీఆర్‌వో బీహెచ్‌ఎస్ హేమసుందర్‌రావు సోమవారం నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వివిధ ఆరోపణలతో పాటు బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని కీలక అంశాల్లో డీఆర్‌వో నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే తక్షణం లాంగ్‌లీవ్‌లో వెళ్లిపోవాలని మంత్రి హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఈయన స్థానంలో జేసీ-2 రజనీకాంతరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ పి. లక్ష్మీనృసింహం సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. డీఆర్‌వో సెలవుపై వెళ్లిపోయేందుకు జిల్లా మంత్రి ఒత్తిళ్లే కారణమని కలెక్టరేట్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, రెవెన్యూ శాఖలో ఆరోపణలు సహజమేనని, డీఆర్‌వో విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని వీరు మండిపడుతున్నాయి.
 
 అనుకున్న వ్యక్తిని తీసుకువచ్చేందుకే
 విజయవాడ దుర్గగుడి ఈవో సీహెచ్ నరసింహరావును ఇక్కడకు తీసుకువచ్చేందుకు జిల్లా మంత్రి విశ్వప్రయత్నాలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ఆయన అక్కడి పూజారుల పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలపై ప్రభుత్వం పక్కన పెట్టి ఆజాద్‌ను ఈవోగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసింహరావును తీసుకువచ్చేందుకే జిల్లా మంత్రి..డీఆర్‌వో బీహెచ్‌ఎస్ వెంకట్రావు పట్ల కక్షపూరితంగా వ్యవహరించి ఉంటారనే కలెక్టరేట్ ఉద్యోగులు భావిస్తున్నారు. పశ్చిమగోదావరి, నెల్లూరు, విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో పనిచేసి సుమారు 9నెలల క్రితమే ఇక్కడకు వచ్చిన డీఆర్‌వోపై అనేక ఒత్తిళ్లు తెచ్చి..పనుల విషయంలో అంగీకరించకపోవడం వల్లే కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి ఆయన్ను దీర్ఘకాలిక సెలవుపై పంపించేయాలని మంత్రి ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కలెక్టరేట్‌కు ఎన్నికల ఖర్చు పేరిట పెద్ద మొత్తంలో నిధులొచ్చాయని, వాటిలో మంత్రి కూడా వాటాలడిగారని, ఈ విషయంలో డీఆర్‌వో అడ్డుతగిలారని, అదే విషయం ఇంత వరకు తెచ్చిందని కూడా ప్రచారంలో ఉంది.
 
 జరిగిందిదీ
  తాము చెప్పింది చేయకపోతే చర్యలు తప్పవంటూ మంత్రి సహా ఆయన అనుచరులు ఇటీవల డీఆర్‌వోపై ఒత్తిళ్లు తెచ్చారని తెలిసింది. ఎన్‌వోసీల జారీ, భూముల ఫైళ్లు కదలడం, సస్పెండయిన ఉద్యోగులకు త్వరితగతిన పోస్టింగ్‌లు ఇవ్వాలనడం, వంశధార నిర్వాసితుల పట్ల కఠినంగా వ్యవహరించడ ం వంటి అంశాలపై జిల్లా మంత్రి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి తేవడం పట్ల డీఆర్‌వో కొన్నిమార్లు మాట వినలేకపోయారని, నిబంధనల ప్రకారమే తాను నడుచుకుంటానని చెప్పడంతో దీర్ఘకాలిక లీవ్‌తో ఆయన బహుమతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్థికలావాదేవీల ఆరోపణలపై సస్పెండయిన వీఆర్‌వోలకు సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో చూసీ చూడనట్టు పోవాలని మంత్రి తరచూ డీఆర్‌వోపై ఒత్తిళ్లు తెచ్చినట్టు కూడా తెలిసింది. భూ సేకరణ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించినందునే సెలవుపై వెళ్లిపోవాల్సి వచ్చిందని కొందరు అధికారులు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement