అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం

13 May, 2020 02:29 IST|Sakshi

కరోనా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తిపై ఒక్కతాటిపైకి ప్రపంచ దేశాలు

బీబీసీ, డబ్ల్యూహెచ్‌వో, బ్రిటన్‌ ప్రభుత్వాల జాయింట్‌ ఆపరేషన్‌

భారత్‌తో సహా 20 దేశాల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పే యత్నం

సాక్షి, హైదరాబాద్‌: నాన్నా... పులి కథ గుర్తుందా? చిన్నప్పుడు చదువుకున్న ఈ కథ చెప్పే సారాంశం ఏమిటంటే.. కావాలనో, సరదాగానో తనకు ప్రమాదం ఉందంటూ అనవసరంగా అబద్ధం చెబితే నిజంగా ప్రమాదం కలిగినప్పుడు నిజం చెప్పినా అది అబ ద్ధమే అనుకుంటారు. ఇప్పుడీ కథ స్ఫూర్తి ప్రధానం కాదు కానీ.. అబద్ధమే ఇక్కడ ప్రధానం. అసత్యమే ప్రస్తుత వివాదం. ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రపం చ దేశాలను ఉత్పాతంలోకి నెట్టిన ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిపై ప్ర పంచ వ్యాప్తంగా పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ సోషల్‌ మీడియా పుణ్యమాని ప్రజల్లోకి వెళ్లి పోయి గందరగోళానికి గురిచేస్తున్నాయి. కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తే ఏదో జరిగిపోతుందని, మళ్లీ ఏడాది తర్వాత వీరవిహారం చేస్తుందనీ, వ్యాక్సిన్‌ తయారీకి ఐదు– పదేళ్లు పడుతుందని.. ఇలా అనేక అవాస్తవాలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే మానవాళిని గం దరగోళానికి గురిచేస్తోన్న ఈ అసత్యాలపై యుద్ధం ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ప్రఖ్యాత టెలివిజన్‌ బీబీసీ, బ్రిటన్‌ ప్రభుత్వంతో కలసి ‘స్టాప్‌ ద స్ప్రెడ్‌’పేరుతో వాస్తవాలతో కూడిన విస్తృత ప్రచారాన్ని చేయాలని నిర్ణయించింది. 

ఏం చేస్తున్నారంటే..!: కోవిడ్‌–19పై ఈ అసత్య ప్రచారాలను కౌంటర్‌ చేసేందుకు గాను బీబీసీ టెలివిజన్‌తో పాటు పలు డిజిటల్‌ ప్లాట్‌ఫారాల ద్వారా భారత్‌తో సహా 20 దేశాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన టూల్‌కిట్లను బ్రిటన్‌ ప్రభుత్వం ఆ దేశాలకు అందజేయనుంది. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చనుంది. కరోనా వ్యాప్తి, దాని ప్రభావం, నియంత్రణ తదితర అంశాలతో కూడిన వాస్తవిక సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వో రూపొందించనుంది. ఈ 3 ప్రయత్నాల ద్వారా పెద్ద ఎత్తున వాస్తవాలను ఆయా దేశాల్లోని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని భావిస్తున్న మే, జూన్‌లో ఈ ప్రయత్నం చేయనున్నారు.

దేశాలివే..: ఇథియోపియా, కెన్యా, నైజీరియా, సియెర్రాలియోన్, టాంజానియా, జాంబియా, బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, థాయ్‌లాండ్, అజర్‌బైజాన్, మొలొదోవ, అల్జీరియా, లిబియా, ట్యునీషియా, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, పరాగ్వే. 

మరిన్ని వార్తలు