‘న్యాయ గడియారాలు’...!

27 Mar, 2018 22:35 IST|Sakshi

కేసుల లెక్క చెబుతాయి.. 

న్యాయపరమైన వ్యవహారాలు, ప్రక్రియల్లో మరింత సమర్థతను పెంచడంలో భాగంగా దేశంలోని మొత్తం  24 హైకోర్టులలో ‘న్యాయ గడియారాలు’ ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్య ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి న్యాయవ్యవస్థలో సమర్థత పెరుగుతుందని  కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మనదేశంలో కేసుల పరిష్కారానికి సంబంధించిన న్యాయప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతూ కక్షిదారులకు  విసుగు చెందేంత స్థాయి వరకు వెళ్లడం మనకు తెలిసిందే.  

న్యాయ విభాగం జవాబుదారీతనం, సమర్థతపై దేశవ్యాప్త చర్చ సాగుతున్న నేపథ్యంలో... ఈ విషయంలో కోర్టుల మధ్య పరస్పరం  కేసుల పరిష్కారంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడంతో పాటు పౌరుల పట్ల న్యాయస్థానాలు మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించేలా చేయొచ్చునని ప్రభుత్వం అంచనావేస్తోంది.   గతేడాది  నవంబర్‌ 26న ‘నేషనల్‌ లా డే’ సందర్భంగా  ప్రధాని నరేంద్రమోదీ వివిధ న్యాయస్థానాల ఆవరణలో న్యాయ గడియారాలుంచాలని  చేసిన సూచనకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ఈ గడియారాల్లో (ఎల్‌ఈడీ మెసేజ్‌ డిస్‌ప్లే బోర్డుల్లో) పెండింగ్‌ కేసుల సంఖ్య    ప్రదర్శిస్తారు. ప్రతీరోజు కోర్టులు పరిష్కరించిన కేసులు, ఇలాంటి కేసుల సంఖ్య ఆధారంగా ఒక్కో న్యాయస్థానం సాధించిన ర్యాంక్‌ ఎంతో అందులో చూపుతారు. 

కొత్తఢిల్లీలోని న్యాయశాఖ కార్యాలయంలో ఇప్పటికే ఇలాంటి గడియారాన్ని ఏర్పాటుచేశారు. దేశంలోని న్యాయస్థానాల్లో అధికసంఖ్యలో కేసులు పరిష్కరించిన వాటిని గురించి ఇందుల్లో ప్రదర్శిస్తారు. దీనికి కొనసాగింపుగా దేశంలోని అన్ని హైకోర్టుల్లో వీటిని అమర్చుతారు. ఆ తర్వాత కింది కోర్టుల్లోనూ వీటిని నెలకొల్పనున్నారు. పరిష్కరించే కేసుల విషయంలో న్యాయస్థానాల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు, పనితీరు ఆధారంగా హైకోర్టులకు ర్యాంక్‌లిచ్చేందుకు ఈ గడియారాలు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి చెబుతున్నారు. భవిష్యత్‌లో అన్ని సబార్డినేట్‌ కోర్టులలో సైతం వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
      –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు