అభివృద్ధి భారతం.. కలాం కల

28 Jul, 2017 00:42 IST|Sakshi
అభివృద్ధి భారతం.. కలాం కల
దానిని సాకారం చేసేందుకు కలసికట్టుగా కృషి చేద్దాం
- దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు
రామేశ్వరంలో కలాం స్మారకం ప్రారంభం
కలాం సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని
జయలలిత లేనిలోటు స్పష్టంగా తెలుస్తోందన్న మోదీ
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న 2022 నాటికి అభివృద్ధి భారతాన్ని చూడాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కలలుగన్నారని, ఆయన కలలను నిజం చేసేందుకు మనందరం కలసికట్టుగా కృషి చేద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ప్రస్తుతం దేశంలో 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో అడుగు ముం దుకేస్తే.. దేశం 125 కోట్ల అడుగులు ముందుకువెళుతుంది’’అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం రెండో వర్ధంతి సందర్భంగా తమిళనా డులోని రామేశ్వరం సమీపంలోని పేయికరుం బూరులో కలాం భౌతికకాయాన్ని ఖననం చేసి న చోటనే నిర్మించిన స్మారక మండపాన్ని ప్రధా ని జాతికి అంకితం చేశారు. కలాం సమాధి వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు.
 
మాది చేతల ప్రభుత్వం..
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కలాం కలలుగన్న అభివృద్ధి భారతాన్ని నిజం చేసేం దుకు కేంద్రం ప్రారంభించిన వివిధ అభివృద్ధి పథకాలైన.. స్టాండప్‌ ఇండియా లేదా స్టార్టప్‌ ఇండియా, అమృత్‌ సిటీస్‌ లేదా స్మార్ట్‌ సిటీస్, స్వచ్ఛభారత్‌ ప్రాజెక్టులు చాలాదూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. కలాం స్మారకంతో రామేశ్వరానికి మరింత శోభ, ప్రతిష్ట చేకూరిం దని, యువత, పర్యాటకులు రామేశ్వరాన్ని, కలాం స్మారకాన్ని సందర్శించాలని మోదీ కో రారు. ‘‘కలాం అంతిమయాత్రలో పాల్గొన్నపు డే స్మారకంపై మాటిచ్చా. నేడు అది నిలబెట్టుకున్నా. రెండేళ్ల వ్యవధిలో అద్భుతమైన స్మారక నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపించా’’అని మోదీ పేర్కొన్నారు.
 
స్ఫూర్తిప్రదాత కలాం..
కలాం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారని మోదీ అన్నారు. యువతను, విద్యార్థులను కలాం అమితంగా ఇష్టపడేవా రని, వారి కోసమే స్టాండప్, స్టార్టప్‌ స్కీముల ను ప్రారంభించామని, యువతకు ఎటువంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు ముద్రా బ్యాంకును ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని పనిచేస్తే.. కొత్త భారతదేశాన్ని, కొత్త తమిళనాడును చూడవచ్చన్నారు. రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు వెళ్లే వీక్లీ రైలును ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, సీఎం కె.పళనిస్వామి, కేంద్ర మంత్రులు పొన్‌ రాధాకృష్ణన్, నిర్మలాసీతారామన్, ఎన్‌డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
స్మారకం.. ప్రత్యేకం..: కలాం స్వగ్రామం పేయికరుంబూరులో తమిళనాడు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కలాం స్మారకాన్ని నిర్మించారు. రూ.15 కోట్లతో నిర్మించిన ఈ స్మారకానికి కలాం తన జీవితకాలంలో ఎక్కువ శాతం గడిపిన డీఆర్‌డీవోనే రూపకల్పన చేసింది. కలాం శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో రూపొందించిన మిస్సైళ్లు, రాకెట్ల నమూనాలను ఇందులో ఏర్పాటు చేశారు. కలాం వీణ వాయించే విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. కలాంకు చెందిన 900 పెయింటింగ్‌లు, 200 అరుదైన ఛాయాచిత్రాలను ఉంచారు. 
 
అమ్మ ఆశీస్సులు ఉంటాయి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కలాం స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘జయలలిత మరణం తర్వాత తమిళనాడులో నేను పాల్గొన్న భారీ కార్యక్రమం ఇదే. ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ(జయలలిత) లేకపోయినా.. తమిళనాడు సమగ్ర వికాసానికి ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను’’అని మోదీ వ్యాఖ్యానించారు.
 
కలాం.. సలాం..
అబ్దుల్‌ కలాం గుణగణాలను ప్రస్తుతిస్తూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన కలాం.. సలాం గీతాన్ని దేశం నలుమూలల నుంచి ఒకేసారి ఐదు కోట్ల మంది విద్యార్థులతో కలసి మోదీ పాడారు. అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది.
 
కలాం కుటుంబంతో కొంతసేపు
కలాం కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు గడిపారు. కలాం సోదరుడు ముత్తుమీరాన్‌ మరైక్కాయర్‌ తదితర సభ్యులతో కలసి కూర్చుని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారి చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని మురిపెంగా ముద్దులాడారు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు