‘అటువంటి విమర్శలు పట్టించుకోను’

1 Aug, 2018 18:17 IST|Sakshi
కశ్మీరీ యువతి మేవిష్‌ (ఫొటో కర్టెసీ : ఇండియా టుడే)

ఎంత పెద్ద కష్టం దాటితే అంత పెద్ద హీరోలవుతారు.. కానీ ఆ హీరో అమ్మాయి అయితే మాత్రం.. ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి కొందరికి అహం అడ్డొస్తుంది. సరిగ్గా  మెవిష్ అనే పాతికేళ్ల యువతి విషయంలోనూ అదే జరిగింది. మెవిష్‌... ఉగ్రదాడులు, భద్రతా బలగాల పహారాల మధ్య నిత్యం బంధీగా ఉండే కల్లోలిత కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో సొం‍తంగా కేఫ్‌ నడుపుతున్న ఓ మామూలు అమ్మాయి. కానీ ఆమె చూపిన చొరవ నేడు ఎంతో మంది యువతుల్లో స్ఫూర్తిని నింపింది. తమ కాళ్ల మీద తాము నిలబడగలమనే నమ్మకాన్ని ఇచ్చింది.

క్యాన్సర్‌ బారిన పడి తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని తలకెత్తుకుంది మేవిష్‌. ఏం చేయాలో పాలుపోని సమయంలో కేఫ్‌ పెట్టాలన్న ఆలోచన తట్టింది ఆమెకు. అనుకున్నదే తడువుగా ఆలోచనను తల్లితో పంచుకుంది. మొదట కాస్త భయపడిన ఆమె తల్లి.. కూతురి ధైర్యాన్ని చూసి సరేనంది. కానీ ఇరుగుపొరుగు వారికి ఈ విషయం అంతగా నచ్చలేదు. ‘ఆడపిల్ల వీధిన పడి వ్యాపారం చేయడమా.. ఇంకా పెళ్లి కూడా కాలేదు... ఇదంతా అవసరమా’  అంటూ మేవిష్‌ను నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలు మేవిష్‌పై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. తల్లి, తోబుట్టువుల సాయంతో శ్రీనగర్‌లో కేఫ్‌ ఏర్పాటు చేసి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతోంది.

విమర్శలు పట్టించుకోను..
‘నేను లా గ్రాడ్యుయేట్‌ని. నాన్న మరణించడంతో ఒక్కసారిగా వీధిన పడ్డాం. ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన సమస్యలు తీరిపోవని తెలుసు. అందుకే కేఫ్‌ పెట్టి కుటుంబాన్ని పోషించాలనుకున్నాను. నా ఆలోచనను పంచుకోగానే ప్రోత్సహించిన వారి కంటే నిరుత్సాహ పరిచిన వారే ఎక్కువ. ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడతానంటే విమర్శలు రావడం సహజం. నా విషయంలో కూడా అదే జరిగింది. కానీ అటువంటి విమర్శలను పట్టించుకుని ఉంటే నా కుటుంబం మరోసారి వీధిన పడాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకే ధైర్యం చేసి ముందడుగు వేశానంటూ’  తన గురించి చెప్పుకొచ్చింది ఈ శ్రీనగర్‌ అమ్మాయి.

మరిన్ని వార్తలు