అక్కను, ఆమె స్నేహితురాళ్లను అరెస్ట్‌ చేయండి..

14 May, 2020 15:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం : ఓ ఎనిమిదేళ్ల బాలుడు చేసిన ఫిర్యాదు చూసి కేరళ పోలీసులు షాక్‌ తిన్నారు. తన అక్కతోపాటుగా ఐదుగురు బాలికలను అరెస్ట్‌ చేయాలని అతడు పోలీసులును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. మూడో తరగతి చదువుతున్న ఉమర్‌ నాదిర్‌ అనే బాలుడు లాక్‌డౌన్‌ వల్ల బయటకు వెళ్లి తన స్నేహితులతో ఆడుకోలేకపోతున్నాడు. అదే సమయంలో అతని అక్క, ఇరుగుపొరుగున ఉన్న ఆమె స్నేహితురాళ్లతో కలిసి ఇంట్లోనే దొంగ-పోలీసు, లూడో వంటి ఆటలు ఆడుకుంటున్నారు. దీంతో ఉమర్‌ వారితో కలిసి ఆడుకోవాలని చూశాడు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పగా.. అందుకు వారు అంగీకరించలేదు. (చదవండి : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్‌!)

ఇదే విషయాన్ని ఉమర్‌ తన తండ్రికి చెప్పాడు. ఇందుకు ఆయన పోలీసులుకు ఫిర్యాదు చేయమని జోక్‌ చేశాడు. అయితే దానిని సీరియస్‌గా తీసుకున్న ఉమర్‌.. ఇంగ్లిష్‌లో ఓ ఫిర్యాదు రాసి ఉంచుకున్నాడు. అదే సమయంలో వేరే కేసు విషయంపై తన ఇంటి సమీపంలోకి వచ్చిన పోలీసులకు ఆ లేఖను అందజేశాడు. తన అక్క, ఆమె స్నేహితులు తనను వాళ్లతో కలిసి ఆడనివ్వడం లేదని తెలిపాడు. ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోవడం లేదని.. అందుకే వాళ్లని అరెస్ట్‌ చేయాలని కోరాడు. (చదవండి : 5 ల‌క్ష‌ల స‌ల‌హాల్లో ఎక్కు‌వ వాటి‌కే: కేజ్రీవాల్‌)

అయితే అప్పటికే సాయంత్రం కావడంతో.. రేపు ఉదయం సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు ఉమర్‌కు చెప్పారు. హామీ ఇచ్చినట్టుగానే మరుసటి రోజు ఉదయం ఉమర్‌ ఇంటి వెళ్లిన పోలీసులు ఉమర్‌తో కలిసి ఆడుకోవాల్సిందిగా అతని అక్కకు, మిగతా బాలికలకు సూచించారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు. అయితే తమ్ముడు తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడని అస్సలు ఊహించలేదని ఉమర్‌ అక్క చెప్పారు. 
 

మరిన్ని వార్తలు