కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు కానీ...

20 Aug, 2018 08:58 IST|Sakshi

తిరువనంతపురం : వరణుడి ప్రకోపానికి దేవభూమి కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను విచ్చిన్నం చేస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద నీటిలో మునిగిపోయిన ఊళ్ల పరిస్థితి ఇంకా దైన్యంగానే ఉంది. దీంతో ఎటుచూసినా హృదయ విదారక​ దృశ్యాలే కనపడుతున్నాయి. వరద బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొన్ని చోట్లకు మాత్రం సరైన సమయంలో చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే తన కుటుంబాన్ని కోల్పోక తప్పదని భావించిన ఓ యువకుడు తానే స్వయంగా రంగంలోకి దిగాడు. తల్లిదండ్రులను, తోబుట్టువులను రక్షించగలిగాడు గానీ తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన త్రిసూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వరద ఉధృతి పెరగడంతో...
రెండు రోజుల క్రితం త్రిసూర్‌ జిల్లాలోని ఓ గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ఊరు ఊరంతా మునిగిపోయింది. వరద ఉధృతి గంటగంటకూ పెరగుతుండటంతో ఆ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు తన కుటుంబాన్నివరద నీటిలో చిక్కుకోవడంతో.. ప్రాణాలకు తెగించి తల్లిని, తోబుట్టువులను ఒక్కొక్కరిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. తండ్రిని కూడా రక్షించే ప్రయత్నంలో వరద ఉధృతి మరింత పెరిగింది. అతికష్టం మీద తండ్రిని దగ్గరున్న చెట్టును ఎక్కించాడు. కానీ వరదపోటు తీవ్రంగా ఉండటంతో తను కూడా చెట్టు ఎక్కే ప్రయత్నంలో పట్టుతప్పి నీటిలో కొట్టుకుపోయాడు. శనివారం సాయంత్రానికి ఆ యువకుడి మృతదేహాన్ని ఊరికి సమీపంలోని చెట్ల మధ్య గుర్తించారు. కళ్లముందే ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. కేరళ వరద బీభత్సంలో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలెన్నో ఉన్నాయి.

మరిన్ని వార్తలు