మరో భారీ విగ్రహం.. ఈసారి కర్ణాటక వంతు

15 Nov, 2018 19:29 IST|Sakshi

బెంగళూరు: దేశంలో నగరాల పేర్ల మార్పు,  పోటాపోటిగా అతిపెద్ద విగ్రహాల నిర్మాణాల జోరు ఊపందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో నర్మదా నది తీరాన ఆవిష్కరించిన 597 అడుగుల ఉక్కుమనిషి సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక వివిధ రాష్ట్రాలు కూడా స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ అంతకాకున్నా భారీ విగ్రహాలే నిర్మించేలా సన్నాహకాలు ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, రెండు తెలుగు రాష్ట్రాలు విగ్రహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా తాజాగా కర్ణాటక కూడా ఈ జాబితాలోకి చేరింది.

ఊహాత్మక చిత్రం

కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని రాజా సాగర రిజర్వాయర్‌లో 125 అడుగుల కావేరీ మాత విగ్రహాన్ని నిర్మించాలని జేడి(ఎస్‌)-కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు.  ఇక్కడే ఓ మ్యూజియం కాంప్లెక్స్‌ను, రెండు గ్లాస్ ట‌వ‌ర్స్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సుమారు 1200 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు.

అయితే విగ్రహ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుచేయడం లేదని, విరాళాల ద్వారా సేకరిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అయితే పటేల్‌ విగ్రహ నిర్మాణం కోసం భారీ ఖర్చుచేయడం పట్ల విమర్శించిన కాంగ్రెస్‌, ఇప్పుడు కర్ణాటకలో తమ సంకీర్ణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్ట్‌పై ఏం సమాధానం చెబుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

మరిన్ని వార్తలు