‘ఆ ఉద్యోగాలకు వారు అనర్హులే’

11 Jul, 2019 15:07 IST|Sakshi

చెన్నై : ఉద్యోగాలకు అవసరమైన అర్హతను మించి ఉన్నత విద్యార్హతలు ఉన్న వారిని ఆయా ఉద్యోగాల్లో నియమించరాదని మద్రాస్‌ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఓవర్‌ క్వాలిఫికేషన్‌ పేరుతో చెన్నై మెట్రో తనకు ఉద్యోగం నిరాకరించడంతో ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్ధానం ఈ మేరుకు తీర్పు వెలువరించింది. 2013లో లక్ష్మీ ప్రభ చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌)లో ట్రైన్‌ ఆపరేటర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ఉద్యోగానికి డిప్లమా అర్హత కాగా, లక్ష్మీ ప్రభ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ కావడం గమనార్హం. కాగా ఆమె దరఖాస్తును జులై 2013న సీఎంఆర్‌ఎల్‌ తిరస్కరించడంతో ఆమె మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నా తన హక్కులను సీఎంఆర్‌ఎల్‌ నిరాకరించిందన్న పిటిషనర్‌ వాదనను జస్టిస్‌ వైద్యనాధన్‌ తోసిపుచ్చారు. ఓవర్‌ క్వాలిఫికేషన్‌ కలిగి ఉన్న ప్రస్తుత ఉద్యోగులనూ తొలగిస్తామని సంస్థ ప్రతినిధులు కోర్టుకు నివేదించారు. ఇక మరో కేసులో కనీస అర్హతలకు మించి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్ధులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించరాదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 ఉద్యోగాలకు గరిష్ట విద్యార్హతలను నిర్ధారించాలని కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసిస్టెంట్‌ పోస్ట్‌లో నియామకానికి ఇంజనీరింగ్‌ డిగ్రీ కలిగిన అభ్యర్ధి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. గతంలో తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికుల పోస్టులకు సైతం ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకోవడం పత్రికల పతాకశీర్షికలకు ఎక్కింది. బీఈ, బీటెక్‌, ఎంటెక్‌ డిగ్రీలు కలిగిన పట్టభద్రులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం గమనార్హం.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ క్లర్కులు, అసిస్టెంట్‌ల పోస్టులకు సైతం పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీలు చేసిన అభ్యర్ధులు సైతం పోటీపడటం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో యూపీ పోలీస్‌లో పాఠశాల విద్యార్హత అవసరమైన  62 గుమాస్తా ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల్లో 81,700 మంది గ్రాడ్యుయేట్లు కాగా, వీరిలో 3700 మంది పీహెచ్‌డీలు ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు